దేశంలో ఆర్థిక అసమానతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒకవైపు బీహార్, యుపి వంటి రాష్ట్రాల్లో మట్టి పెళ్లలు, పచ్చగడ్డితో బతుకు వెళ్లదీస్తున్న అభాగ్యుల దీనగాథలు..ఇంకోవైపు రోజురోజూకు పెరిగిపోతున్న శతకోటీశ్వరుల సంపద వైభోగాలు. గురు, శుక్రవారాల్లో విడుదలైన రెండు నివేదికలు మన దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఎంతటి తీవ్రరూపం దాల్చాయో తేటతెల్లం చేస్తాయి. వీటిలో ఒకటి శత కోటీశ్వరుల జాబితా, ఇంకొకటి నీతి అయోగ్ 'పోషకాహార' నివేదిక. మన రాష్ట్రంలోనే 63 శాతం మంది చిన్నారులు రక్త హీనతతో బాధపడుతున్నారంటే అసమానతల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సంపద కేంద్రీకరణ దేశంలో ఎంత ప్రమాదకర స్థితికి చేరిందో హురూన్-ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ సంస్థలు గురువారం విడుదల చేసిన నివేదిక చూస్తే అర్థమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత ఆప్తుడైన ప్రముఖ కార్పొరేట్లు గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీ సంపదలు అమాంతంగా పెరిగిపోయాయి. అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద అనూహ్యమైన రీతిలో ఒక్క ఏడాదిలోనే నాలుగు రెట్లు పెరిగిపోవడం గమనార్హం. 2019-20లో రూ.1.4 లక్షల కోట్లుగా ఉన్న అదానీ సంపద 2020-21లో ఏకంగా రూ.5.06 లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే అదానీ కుటుంబ రోజువారీ ఆదాయం సగటున రూ.1002 కోట్లు పెరిగిందన్నమాట. నిత్యం సిరుల పంట పండించే ఓడ రేవులు, విమానశ్రయాలు వంటి ప్రభుత్వ సంస్థలు ఈ ఏడాది అదానీ వశమైన సంగతి తెలిసిందే. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి వారికి వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు ఇంకా అమలులోకి రాకుండానే వ్యవసాయ మార్కెట్‌లో కార్పొరేట్ చొరబాటు వల్ల అన్నదాతలు నష్టాల్లో కూరుకుపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ యాపిల్ రైతులను ఇదే అదానీ గ్రూపు సంస్థ మార్కెట్ జోక్యంతో నష్టాల్లోకి నెట్టేసి కోట్లకు పడగలెత్తిన వైనాన్ని చూస్తున్నాం. ఇక ఆ చట్టాలు అమలు జరిగితే ఏంకానున్నదో వేరే చెప్పనవసరం లేదు.
ఇక ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్‌ను కాదని 4జి టెక్నాలజీ మొత్తాన్ని రిలయన్స్‌కు కేటాయించడం, చిల్లర వర్తకం మొదలుకొని రక్షణ రంగం వరకూ నింగినేలా మొత్తం ప్రయివేటుకు దాసోహం చేసినందునే వీరి ఆస్తులు ఎగబాకిపోయాయి.
ముకేష్ అంబానీ రూ.7.18 లక్షల కోట్లతో ఉంటే, హెచ్‌సిఎల్ అధినేత శివ్ నాడార్ కుటుంబ సంపద కూడా 67 శాతం పెరిగి రూ.2.36 లక్షల కోట్లకు ఎగిసింది. ఉక్కు కార్పొరేట్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కుటుంబం గతేడాది రోజుకు రూ.312 కోట్ల సంపదను ఆర్జించింది. వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం గతేడాది ఏడాదికి రూ.190 కోట్లు సంపాదించింది. భారత్‌పే పేమెంట్స్ యాప్ కోఫౌండర్ శాశ్వత్ నక్రానీ శతకోటీశ్వర్ల జాబితాలో చేరారు.
కోవిడ్ కరాళనృత్యం చేసిన గతేడాది కూడా కొత్తగా 58 మంది శతకోటీశ్వర్ల జాబితాలో చేరారని హురూన్ నివేదించింది. శ్రామిక ప్రజానీకం వైపు నుండి సంపద కార్పొరేట్ల వైపు వివిధ రూపాల్లో ప్రవహిస్తోంది. దీని ఫలితంగా ఆ శ్రమజీవుల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. దాని పర్యవసానాలలో ఈ రక్తహీనత పెరిగిపోవడం కూడా ఒకటి. క్రోనీ క్యాపిటలిజం ప్రజల రక్త మాంసాలను సైతం కొల్లగొట్టి సంపదగా మార్చుకుంటోంది. ఈ విధానాలకు ప్రత్యామ్నాయాన్ని అమలు జరిపే రాజకీయ శక్తుల పునరేకీకరణ ఆవశ్యకతను ఈ రెండు నివేదికలూ తెలియజేస్తున్నాయి.










