Oct 24,2023 21:12

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రూపొందించిన ప్రజాప్రణాళికను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి మంగళవారం ఉదయం ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో సిపిఎం రాష్ట్ర కమిటీ వివిధ రంగాల మేధావులు, ప్రొఫెసర్స్‌, జర్నలిస్టులు, నిపుణులతో రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సెమినార్లు నిర్వహించిందన్నారు. ఆ సందర్భంగా వచ్చిన అనేక అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్ధిష్టమైన ప్రజాప్రణాళికను సిపిఎం రూపొందించిందన్నారు. ముఖ్యంగా బిజెపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదన్నారు. పైగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించి, ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ విద్య, వైద్య సేవలు ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయరంగంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, స్వామినాథన్‌ కమిషన్‌, జయతీ ఘోష్‌, రాధాకృష్ణ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చిన్న పరిశ్రమలకు సహకారం అందించి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టం పనిదినాలు 200 రోజులకు పెంచి, కనీస కూలీ రోజుకు రూ.600 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింపజేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, ఒపిఎస్‌ను అమలు చేయాలని, ప్రయివేటు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్‌ సంస్కరణలు అమలు నిలిపివేయాలని, ప్రజలపై ఛార్జీల భారం తగ్గించాలన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400, పెట్రోల్‌, డీజిల్‌ లీటరు రూ.60కే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని, భూమి లేని పేదలకు రెండు ఏకరాలు పంపిణీ చేయాలన్నారు. ఇల్లు లేని పేదలకు రెండు సెంట్ల స్థలం, రూ.ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వాలన్నారు. మహిళలు, వికలాంగులు,మైనార్టీలకు రక్షణ కల్పించాలని, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనాధ పిల్లలు, వృద్దులకు ఉచిత వృద్దాశ్రమాలు నడపాలన్నారు. పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. ఈ విధంగా అనేక అంశాలతో సిపిఎం తన ప్రణాళికను రూపొందించిందని వివరించారు. దీనిపై సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్రలు నిర్వహిస్తుందన్నారు. వచ్చేనెల ఐదో తేదీన ఏలూరు జిల్లాలోకి రాష్ట్ర బస్సు యాత్ర ప్రవేశిస్తుందని, ఆరు, ఏడు తేదీల్లో జిల్లాలో పర్యటిస్తుందన్నారు. నవంబర్‌ 15వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.కిషోర్‌, కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌, బి. సోమయ్య, నాయకులు ఎస్‌.సత్యనారాయణ, మీసాల సత్యం పాల్గొన్నారు.