
ప్రజాశక్తి - తుళ్లూరు : సిపిఎం ఆధ్వర్యంలో 15వ తేదీన విజయవాడలో నిర్వహించే ప్రజారక్షణభేరి బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి కోరారు. ఈ మేరకు సోమవారం రాజధానిలో విస్తృతంగా ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు. రవి మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రణాళికను రూపొందించిందని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రల ద్వారా ప్రచారం చేస్తోందని చెప్పారు. ముగింపు సభ విజయవాడలో ఉంటుందన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మేలో రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలును అక్టోబర్ పూర్తి అవుతున్నా ఇప్పటివరకు చెల్లించలేదని, రాజధాని రైతులు పట్ల రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. కౌలు చెల్లిస్తుందో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. రాజధాని పేదలకు సామాజిక పింఛను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. రాజధాని పేదలకు ఉపాధి లేకుండా చేసి, కార్మికులను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న వైసిపి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇచ్చేలా సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని, స్కీం వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిన కేంద్రంలోని బిజెపిని ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. రూ400కే గ్యాస్, రూ.60కే లీటర్ పెట్రోల్, రూపాయికి ఒక యూనిట్ కరెంట్, ఉచితంగా ఇసుక ఇవ్వాలని కోరారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, వీటితోపాటు అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీటిపై సిపిఎం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.వెంకటేశ్వరరావు, పి.బాబురావు, కె.ఆంజనేయులు, షేక్ జానీ, కె.వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాసరావు, సిహెచ్ కృష్ణారావు, నరసమ్మ, నాగమల్లేశ్వరరావు, బి.రాజు, ఎస్.గురుకృష్ణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మండలంలోని ఆత్మకూరులో ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం నిర్వహింగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు సమర్థిస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటాలకు జనం మద్దతు నివ్వాలని కోరారు. ప్రజారక్షణభేరి బహిరంగ సభ పోస్టర్, ప్రజాప్రణాళికను ఆవిష్కరించారు. ఎం.పకీరయ్య, యు.దుర్గారావు, సిహెచ్.జనార్ధనరావు, జి.అజరు కుమార్, సిహెచ్.సీతారామాంజనేయులు, బి.రాంబాబు, సిహెచ్.గిరిధరరావు, ఆనందం బాబ్జి, వి.సురేష్, ఎం.శీను, జి.లక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పోరాడుతోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య అన్నారు. పట్టణంలోని గోపాల్ కృష్ణ సెంటర్ శాఖ సమావేశం సోమవారం రాత్రి స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ఇ.కాటమరాజు అధ్యక్ష వహించారు. చెంగయ్య మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రచార జాతాలు చేపట్టిందన్నారు. నవంబర్ రెండో తేదీన మంగళగిరిలో జరిగే కంటే రంగారావు వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఎం.వెంకటేష్, జి.వెంకయ్య, కె.మణికుమారి, సోమయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి -మేడికొండూరు : మండల కేంద్రమైన మేడికొండూరులో నిర్వహించిన సమావేశంలో సిపిఎం నాయకులు బి.రామకృష్ణ మాట్లాడారు. సాగర్ కుడికాల్వ పరిధిలో ఎక్కువ మంది మిర్చి సాగు చేశారని, ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి అయ్యిందని చెప్పారు. అయితే సాగునీటిని విడుదల చేయని కారణంగా రైతులిప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. పంటలను కాపాడాలనే ఆలోచనే ప్రభుత్వంలో లోపించిందని విమర్శించారు. రబీ పంటలైన జొన్న, మొక్కజొన్న సాగుకు నీరు ఇవ్వలేమని, వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ప్రభుత్వం నాయకులు చెప్పటం బాధాకరమన్నారు. దేశాన్ని బిజెపి ప్రభుత్వం దివాలా తీయిస్తోందని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు బి.శ్రీనివాసరావు, ఎస్‌ఎం బాష, డి.వెంకటేశ్వర్లు, ఎస్‌కె షరీఫ్ పాల్గొన్నారు.