
- సమాజంలో వివక్షతపై విద్యార్థినుల ప్రదర్శనలు
- ఆలోచింపజేసిన 'సేఫ్' సాంస్కృతికోత్సవాలు
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సేఫ్ (స్టెప్ ఎ హెడ్ ఫర్ ఈక్వాలిటీ) - కెవిఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ కళాశాల సంయక్త నిర్వహణలో జరుగుతున్న అంతర కళాశాలల సాంస్కృతిక ఉత్సవాలు ఆలోచింపజేశాయి. సమాజంలో ఉన్న అసమానతల గురించి విద్యార్థులు చక్కగా చేసి చూపించారు. తొలిరోజు స్కిట్, డ్రామా, మైమ్, మిస్టర్ అండ్ మిస్ సేఫ్, సెల్ఫ్ డిపెన్స్‌పై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో నగరం నుండే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని 19 కళాశాలల నుండి సుమారు 500 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమలోని సృజనాత్మకతను బయటకు తీసి సమాజంలో జరుగుతున్న దారుణాలు, మహిళల ఇబ్బందులు గురించి తమ తమ స్కిట్లలో చక్కగా చేసి చూపించారు. అన్ని పోటీలకు లింగ సమానత్వం, అసమానత, హింస ధీమ్‌గా ఇచ్చారు. నగరంలోని లయోలా కళాశాల విద్యార్థులు ముఖానికి రంగు పూసుకుని ముఖాభినయంతో తమ హావ భావాలతో సమాజంలో జరుగుతున్న అంశాలను ఇతివృత్తంగా చక్కగా చేసి చూపించారు. అలాగే డిబెట్‌లో కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలో తీసుకునే నిర్ణయాలు వాటి ఇతి వృత్తాలుగా తీసుకుని నగరంలోని సిద్ధార్థ, లయోలా, నలంద విద్యార్థులు నిర్వహించిన డిబెట్ చూపరులను ఆలోచింపచేసింది. పురుషాధిక్యత సమాజంలో ఏవిధంగా ఉన్నదో కూడి విద్యార్థులు నేటి సమాజం గురిచి తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ పోటీలకు సంబంధించి రోజువారీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతిఘటన ఏవిధంగా చూపాలో విద్యార్థులు తెలియజేశారు. ఈవ్‌టీజింద్, యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, ఇంటా బయటా హింస తదితర సంఘటనలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియచేశారు.
మిస్టర్ అండ్ మిస్ సేఫ్...
ఇది పూర్తిగా వ్యక్తిత్వ పోటీగా నిర్వహించారు. నగరంలోని వివిధ కళాశాలల నుండి విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యక్తిగత ఆసక్తులతో పాటు వివక్షతపై వ్యక్తిగత అభిప్రాయాలను ఇందులో తెలియచేస్తూ విద్యార్థులు వ్యక్తిగత అంశాల పోటీల్లో పాల్గొన్నారు. 13వ తేదీన శుక్రవారం ప్లాష్‌మాబ్, స్ట్రీట్ ప్లే, డిబేట్ అంశాల్లో పోటీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేయనున్నారు.