ముచ్చటగా ఒక సున్నా చుట్టి
రెండు నిలువు, రెండు అడ్డగీతలు గీసి ఆ బొమ్మలో
వాడి మనసు నింపి..
పక్కన టీచర్స్ అని రాశాడట...
వాడిలో నాకొక ఆర్టిస్ట్ కనిపిస్తుంటే..
మరి అదేంటో
వాళ్ల టీచర్‌కి వాడొక టెర్రరిస్టులా
కనిపిస్తున్నాడు..
గేమ్స్ పీరియడ్ అయ్యాక
గ్రౌండ్‌లో నీరసమొచ్చే వరకూ నిలబెట్టేసరికి
జనగణమన సమయానికి
అసెంబ్లీలో భుజాలు తిప్పి
డాన్స్ చేస్తున్నాడట...
నాకేమో చుర్రున కాలే
ఎండలో నీరసించిపోయిన
దేశభక్తుడు కనిపిస్తుంటే..
మరి అదేంటో వాళ్ల టీచర్‌కి
వాడొక దేశద్రోహిలా కనిపిస్తున్నాడు..
వెనక బెంచీలో
కూర్చుని రోజుకో పెన్సిల్ చెక్కేసి,
బాక్సులతో ఇళ్లు కట్టి,
వాడిలో వాడు
పాటలు పాడుకుంటాడట..
నాకేమో అమ్మ ఒడిలో కాకుండా బడి నీడలో ఎదుగుతున్న కళాకారుడు కనిపిస్తుంటే...
మరి అదేంటో వాళ్ల టీచర్‌కి
వాడొక జులాయిలా
కనిపిస్తున్నాడు..
కనిపించిన వెంటనే
గుడ్ మార్నింగ్
చెప్పకుండా...
పెన్సిల్ సరిగా
పట్టుకోకుండా
నోట్సులు రాస్తాడట...
నాకేమో మనసు చెప్పినట్టు
వింటున్నాడనిపిస్తుంటే...
అదేంటో వాళ్ల టీచర్‌కి
వాడొక పోకిరీలా కనిపిస్తున్నాడేమిటో...
ఇప్పుడా తల్లి ఎవరికి
శిక్ష వేయాలి..?
వింత జీవిని కన్న
తన గర్భానికా..?
పిల్లల చేష్టలపై కంప్లైంట్స్
ఇచ్చే టీచర్లకా...
క్లాస్ రూమ్‌లో కూర్చుని
దేశద్రోహం చేస్తున్న
విద్యార్థికా...?
రేపటి పౌరులను టెర్రరిస్టులుగా
మార్చుతున్న విద్యావ్యవస్థకా..?
అమూల్యచందు
90598 24800