గతంలో ప్రపంచంలో ఉన్న వైద్యాలన్నింటినీ అధ్యయనం చేసి వడకట్టినదే గదా 'ఆధునిక వైద్యం'. ఇంకా అనేక అధ్యయనాలు చేయాలి. కొత్త జబ్బులు విసిరే సవాళ్లు ఎప్పుడూ వుంటూనే వుంటాయి. చరకుడు రాసిన 'చరక సంహిత', శుశ్రూతుడు రాసిన 'శుశ్రూత సంహిత' లనూ, ఆయుర్వేద, సిద్ధ, యునానీ మందుల మీద 'ప్రభుత్వం ఆధ్వర్యంలో' మరింత పరిశోధనలు జరగాలి.
రాన్రానూ ఇంగ్లీషు వైద్యం ఖరీదైపోతున్నది. అందుకే ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియో, ఎలక్ట్రో హోమియో, రేకీ, నాటు వైద్యం వంటి పేర్లతో నడుస్తున్న వైద్యాలను ప్రోత్సహించక తప్పదనే వాదం బలంగా వినబడుతున్నది.
వైద్యానికి ఇన్నిన్ని పేర్లా ?
ఇంగ్లీషు వైద్యం లేదా అల్లోపతీ అనే దాన్ని ఒక వైద్య విధానంగానూ, మిగతావన్నీ ప్రత్యామ్నాయ వైద్య విధానాలనీ పిలుచుకోవాలా ?
500 సంవత్సరాల క్రితం వరకు మానవుడి శరీర నిర్మాణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. మృతదేహాలను కోసి చూసిన తరువాతే 'దేహనిర్మాణ శాస్త్రం (ఎనాటమీ)' మనకు అర్ధం అయింది. దాని తర్వాత అనేక పరిశోధనల అనంతరం 'దేహ ధర్మాలైన జీర్ణక్రియ, శ్వాసక్రియ, మెదడు-గుండెల పని తీరు వగైరాలన్నీ (ఫిజియాలజీ)' అర్ధం అయ్యాయి.
కాలక్రమేణా పరిశోధనలు మరింతగా ముందుకు సాగి, రోగాల సమయంలో శరీరంలో ఏయే మార్పులు వస్తుంటాయో కూడా (పేధాలజీ) తెలిశాయి.
గాలిలో సూక్ష్మ జీవులు ఉన్నాయని తెలిసింది 160 సంవత్సరాల క్రితమే. వాటి ద్వారా వచ్చే జబ్బులు, రాకుండా ఏం చేయాలో, వస్తే ఏం చేయాలో తెలిసింది ఆ తర్వాతే (మైక్రోబయాలజీ).
వందేళ్ళ క్రితం వరకూ యాంటీబయాటిక్స్ అనే మందులే లేవు. మొట్ట మొదటి యాంటీబయాటిక్ 'పెన్సిలిన్' ను 1942లో ఉపయోగించారు. ఇప్పుడు మనం వాడే మందులన్నీ ఆ తర్వాత కనిపెట్టినవే (ఫార్మకాలజీ).
మరి ఈ ఐదారు వందల ఏళ్లకు ముందు వైద్యమే లేదా?
ఇంగ్లీషు వైద్యం అనబడే ఈ వైద్యానికి ముందు మన వాళ్ళు మందులేమీ వాడలేదా? వాడితే ఏం వాడారు? ఏ దేహధర్మాల ఆధారంగా వాడేవారు?
పరిణామ క్రమంలో మనిషి పుట్టినప్పటి నుండీ బాధలు, జబ్బులు ఉండే ఉంటాయి కదా! తలనొప్పి, పంటి నొప్పి, దగ్గు, జ్వరం, దేహానికి దెబ్బలు, కాళ్ళు-చేతులు విరగడాలూ అన్నీ ఉంటాయి గదా! ఇంత ఎక్కువగా కాకపోయినా గుండెపోట్లు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు కూడా ...పేర్లు వేరైనా - ఉండే ఉంటాయి!
మరి వీటన్నింటినీ భరిస్తూ సుదీర్ఘ కాలం చూస్తూ ఊరుకోరు కదా? ఏదో ఒక వైద్యం చేసుకోకుండా బాధలు పడరు కదా?
మొట్ట మొదటి మనిషే 'మొదటి వైద్యుడు'. మొట్ట మొదటి ఆడమనిషే 'మొదటి నర్సు'. అప్పట్నుండీ మానవుల బాధలను తగ్గించడానికి తమకు తెలిసిన, కనిపెట్టిన ప్రక్రియలను ఉపయోగిస్తూనే ఉన్నారు!
గ్రీకులు, రోమన్లు, చైనా వారు, అరబ్బులు, భారతీయలు ఎక్కడి సమూహాలు అక్కడ వారివారి అనుభవంలో నేర్చుకొన్న విధానాల ఆధారంగా మనుషుల బాధలను తగ్గించడానికి వైద్యం చేసుకుంటూనే ఉన్నారు.
యూరప్ లో 'గేలన్' (130-205 ఎ.డి) అనే ఆయన ప్రతిపాదించిన వైద్య సిద్ధాంతం ఆధారంగా 1500 సంవత్సరాల పాటు వైద్యం జరిగింది.
'వెసాలియస్' అనే శాస్త్రవేత్త దేహ నిర్మాణాన్ని (ఎనాటమీ), 'విలియం హార్వే' అనే ఇంకొక శాస్త్రవేత్త దేహ ధర్మాల్ని (ఫిజియాలజీ) శాస్త్రీయంగా అధ్యయనం చేసే వరకూ గేలన్ సిద్ధాంతం ప్రకారమే వైద్యం జరిగింది.
ఆ తర్వాతనే 'ఆధునిక వైద్య విధానం' అంగలూ పంగలతో అభివృద్ధి చెందింది. జబ్బుల కారణాలు, దేహంపై వాటి ప్రభావాలు, వాటి నుండి ఉపశమనం ఇవ్వగల మందులు, శస్త్ర చికిత్సలు కనిపెట్టబడ్డాయి.
మానవుడి ఆయుర్దాయం 100-110 సంవత్సరాలు. అయితే వంద సంవత్సరాల క్రితం వరకూ సగటు ఆయుర్దాయం 30-40 సంవత్సరాల మధ్యనే ఉండేది. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలలో సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలకు పైగా ఉంటే, మన దేశంలాంటి వాటిలో 69 సంవత్సరాలకు పైగా ఉంది.
'సగటు ఆయుర్దాయం'తో పాటు 'శిశు మరణాల రేటు' వంటి అనేక ఆరోగ్య సూచికలన్నింటిలో ఇంత అభివృద్ధికి కారణం ఎందరెందరో శాస్త్రజ్ఞుల కృషే!
అన్ని దేశాల వివిధ కాలాల పాత వైద్యాలలోని ఉపయోగపడే అంశాలన్నిటినీ ప్రయోగ నిరూపణ పూర్వకంగా మిళితం చేసుకున్నదే ఆధునిక వైద్యము.
భారత దేశ వైద్యంలో 'సర్పగంధి' మొక్క వేళ్ళను కొన్ని శతాబ్దాల నుండి ఉపయోగిస్తున్నారు. ఈ వేళ్ళు నమిలితే కొంతమందికి ఆరోగ్యం మెరుగ్గా అనిపించేది. అలా ఎందుకనిపిస్తుందో తెలుసుకోవాలని 70 సంవత్సరాల క్రితం ప్రయోగశాలలో పరీక్షలు చేశారు. ఆ వేళ్ళలో 16 రకాల ఆల్కలాయిడ్స్ అనే రసాయనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అయిన ''రిసర్పిన్'' అనే ఆల్కలాయిడ్ తీసుకున్న వారికి 'అధికంగా ఉన్న రక్తపోటు' తగ్గుతోంది. మిగిలిన 15 ఆల్కలాయిడ్లకు దేహానికి ఉపయోగపడే ప్రభావం ఏమీ లేదని తేలింది. ఈ పరిశోధనల తర్వాత కూడా అందరికీ ''సర్పగంధి వేళ్ళు మంచివి, అందరూ నమలండి'' అని సలహా ఇస్తామా? అధిక రక్త పోటు ఉన్న వారికి మాత్రమే ఆ వేళ్ళలో నుంచి తీసిన 'రిసర్పిన్' అనే రసాయనాన్ని ఇస్తామా?
అనేక అనవసర రసాయనాలు కలిగిన సర్పగంధి వేళ్ళను నమిలించినందుకు ప్రాచీన వైద్యాన్ని వెక్కిరిద్దామా? తప్పు గదా!
ఆ కాలానికి వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి కొన్ని బాధలకు కొన్ని వేళ్ళో, ఆకులో, పూలో, కాయలో, వాటి నుంచి వచ్చిన కషాయాలో ఇచ్చేవారు. కాలక్రమేణా దేహ నిర్మాణం, దేహ ధర్మం, రసాయన శాస్త్రం మనకు ఇంకా బాగా అర్ధం అయినప్పుడు రోగాలకు సరైన కెమికల్స్ ను సరైన మోతాదులో ఇస్తున్నాము.
గతంలో ప్రపంచంలో ఉన్న వైద్యాలన్నింటినీ అధ్యయనం చేసి వడకట్టినదే గదా 'ఆధునిక వైద్యం'. ఇంకా అనేక అధ్యయనాలు చేయాలి. కొత్త జబ్బులు విసిరే సవాళ్లు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.
చరకుడు రాసిన 'చరక సంహిత', శుశ్రూతుడు రాసిన 'శుశ్రూత సంహిత' లనూ, ఆయుర్వేద, సిద్ధ, యునానీ మందుల మీద 'ప్రభుత్వం ఆధ్వర్యంలో' మరింత పరిశోధనలు జరగాలి.
ముక్కు తెగిపోయిన వారికి మళ్ళీ ముక్కును అమర్చే ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంటారు. క్రీస్తు పూర్వం మన దేశంలో 'శుశ్రూతుడు' చేసిన ఈ శస్త్రచికిత్స 'ఇండియన్ ఫోర్‌హెడ్ రినోప్లాస్టీ'గా ప్రపంచమంతటా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.
పూరిల్లు - పెంకుటిల్లు - డాబా
మన తాతలు పాకల్లో బతికేవారు. ఆర్థికంగా కాస్త అభివృద్ధి చెందిన తర్వాత పెంకుటిళ్ల లోకి మారారు. మరి కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వారు డాబాలు కట్టుకుంటున్నారు. డాబా మంచిది, ఆధునికం. రక్షణ ఎక్కువగా కల్పిస్తుంది. అందుకని మన తాతలను, వారి పూరిళ్ళను ఎగతాళి చేస్తామా? తప్పు కదా! ఆ కాలానికి పూరిల్లు, ఈ కాలానికి డాబాలు.
ఆఖరి మాట ...
1632వ సంవత్సరం నుండీ మలేరియా జబ్బుకు వైద్యంగా 'సింకోనా' చెట్టు బెరడు నుండి తీసిన రసాన్ని వాడుతుండేవారు. 1820 లో ఆ బెరడు నుండి 'క్యినైన్' మందును తయారు చేసి మలేరియాకు వైద్యం చేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం నుండీ చైనా వారు 'ఆర్టీమీసియా' మూలికలను మలేరియా వైద్యానికి వాడుతున్నారు. 1972లో ఈ మూలికలలో ఉన్న 'ఆర్టిమెసినిన్' అనే రసాయనమే మలేరియాకు మందుగా పనిచేస్తుందని కనుగొన్నారు. గుండె జబ్బులలో వాడే 'డిజిటాలిస్' మందు కూడా మొక్కల నుంచి తీసినదే. గతంలో ప్రాచుర్యంలో ఉన్న అన్ని వైద్య విధానాల లోని ఉపయోగపడే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించినదే ఆధునిక వైద్యం. కాబట్టి 'ప్రత్యామ్నాయ వైద్య విధానం' అనే మాటకు అర్ధమే లేదు. అయితే, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన గత కాలపు వైద్య విధానాల లోని మందులను వాడుకునే స్వేచ్ఛను ఎవరూ కాదనకూడదు. అలాగే, ఖరీదైపోతున్నదనో, మరే కారణం వల్లనో శాస్త్రీయ ఆధునిక వైద్యాన్ని నిరసించనూకూడదు.
ఆధునికతను, శాస్త్రీయతను సమర్ధిస్తూ గురజాడ మహాకవి చెప్పినట్లు...'మెచ్చనంటావీవు...నీవిక మెచ్చకుంటే మించి పాయెను... కొయ్య బొమ్మలు మెచ్చు కనులకు కోమలుల సౌరెక్కునా ?
డా|| దాసరి రామకృష్ణ ప్రసాదు











