Nov 21,2022 21:41

రూ.3300 వేల కోట్లు తప్ప ఇతర అంశాల ఊసే లేదు
వశిష్ట వారధి నిర్మాణానికి చర్యలు : ముఖ్యమంత్రి జగన్‌
లింకు రోడ్లు, శ్మశానవాటికల ఏర్పాటుకు సహకరించాలి : ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు
సిపిఎం, ఫుడ్‌పార్కు ఉద్యమ నేతలపై విరుచుకుపడ్డ పోలీసులు
పలుచోట్ల బిజెపి నేతల గృహనిర్బంధం
ప్రజాశక్తి - భీమవరం, నరసాపురం టౌన్‌

భీమవరం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాడ్డక ముఖ్యమంత్రి జగన్‌ తొలిసారి నరసపాపురం పర్యటనకు విచ్చేశారు. ఈ పర్యటనపై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి పర్యటన నరసాపురం నియోజకవర్గానికే పరిమితమైంది. కనీసం నూతన జిల్లా అభివృద్ధికి ఎటువంటి ప్రకటనా సిఎం చేయకపోవడంపై జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం పర్యటించారు. ఆయన హెలీకాప్టర్‌లో ఉదయం 11.04 నిమిషాలకు నరసాపురం మండలం చినమామిడిపల్లిలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాద్‌రాజు, కలెక్టర్‌ ప్రశాంతితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు సిఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో జగన్‌ దారి పొడవునా అభివాదం చేసుకుంటూ రుస్తుంబాదలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి 11.54 నిమిషాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి రూ.4.80 కోట్లతో నిర్మించిన బస్సు కాంప్లెక్స్‌, రూ.11 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని బటన్‌ నొక్కి ప్రారంభించారు. రూ.332 కోట్లతో నిర్మించనున్న ఆక్వా యూనివర్శిటీ, రూ.429 కోట్లతో నిర్మించనున్న బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హర్బర్‌, రూ.1400 కోట్లతో నిర్మించనున్న వాటర్‌ గ్రిడ్‌తోపాటు మొత్తం రూ.3300 కోట్లతో చేపట్టిన పలు అభివీద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. 12.37 నిమిషాలకు వేదికపైకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ ముందుగా వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవ సభలో కలెక్టర్‌ పి.ప్రశాంతి ప్రారంభోపన్యాసం చేశారు. సుస్థిర అభివృద్ధి, అవసరమైన నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనకు రూ.3300 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. ఆక్వా యూనివర్శిటీ, ఫిషింగ్‌ హర్బర్‌, వాటర్‌ గ్రిడ్‌ వంటివి నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా బస్సు కాంప్లెక్స్‌ ఆధునీకరణ, వంద పడకల ఆసుపత్రి నిర్మించుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌, నరసాపురం ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు, ముఖ్యమంత్రి జగన్‌ సభలో మాట్లాడుతూ కలెక్టర్‌ ప్రస్తావించిన అంశాలనే పదేపదే ప్రస్తావించారు. 36 నిమిషాలపాటు ప్రసంగించిన జగన్‌ సమయం అంతా నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసమే మాట్లాడారు. చివరి పది నిమిషాలు టిడిపి, జనసేనపై చేసిన ఘాటైన వ్యాఖ్యలతో సభికుల్లో కదలిక వచ్చింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన కొత్త కేంద్రంతోపాటు జిల్లా సమగ్రభివృద్ధికి దోహదపడుతుందని అంతా ఆశించినప్పటికీ దానికి అవకాశం లేకుండాపోయింది.
వశిష్ట వారధిపై వంతెన నిర్మాణానికి చర్యలు : సిఎం జగన్‌
ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న వశిష్ట వారిధిపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరిలో వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. పట్టణంలో రూ.13 కోట్లతో నిర్మించిన వండ పడకల ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఆక్వా విశ్వ విద్యాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. దేశంలో తమిళనాడు, కేరళ మినహా ఎక్కడా ఆక్వా యూనివిర్శిటీలు లేవన్నారు. ఆక్వా సాగు వల్ల తాగు నీరు కలుషితమైందని, పూర్వపు పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలకు రక్షిత నీటిని అందించేందుకు రూ.1400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ నిర్మించనున్నామన్నారు. ముఖ్యంగా మత్స్యకారుల కోసం బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హర్బర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అగ్రికల్చర్‌ కంపెనీ భూముల లీజును రద్దు చేస్తున్నామని చెప్పారు. సుమారు 1754 ఎకరాలకు సంబంధించి 1623 మంది రైతులకు పూర్తి హక్కును కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబం పొందిన లబ్ధిని కొలమానంగా తీసుకొని రాబోయే రోజుల్లో వైసిపికి అండగా నిలవాలని కోరారు.
మత్స్యకారుల అభ్యున్నతికి జగన్‌ కృషి
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు

మత్స్యకారుల అభ్యున్నతికి సిఎం జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయమని మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధానంగా రూ.10 వేల ఆర్థిక సాయం, రూ.తొమ్మిది డీజిల్‌పై రాయితీ, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నెల్లూరు, బాపట్ల, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ఫిషింగ్‌ హర్బర్ల పనులు జరుగుతున్నాయని, తాజాగా బియ్యపుతిప్పలో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.
అడుగడుగునా ఆంక్షలు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నరసాపురం పట్టణమంతా అడుగడుగునా ఆంక్షలు విధించారు. రోడ్డుకు ఇరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారికీ ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలకొల్లు బైపాస్‌ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బహిరం గ సభా ప్రాంగణం పట్టణానికి దూరంగా ఉండడంతో జనాలను కష్టాలు వెంటాడాయి. ముఖ్యంగా సభా వేదిక వద్ద మీడియాపైనా తీవ్ర ఆంక్షలు విధించారు. ఎటువంటి ఫొటోలు తీయకూడదని నిబంధన విధించడం గమనార్హం.
లింకు రోడ్లు, శ్మశానవాటికల ఏర్పాటుకు సహకరించాలి : ప్రభుత్వ విప్‌ ప్రసాదరాజు
అభివృద్ధిలో వందేళ్లు వెనక్కి ఉన్న నరసాపురం నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి జగన్‌ రాకతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, నరసాపురం ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బహిరంగ సభలో ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాల పునర్విభజనలో జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరానని, అయితే రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణలో తన వెంట ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేశారు. నాడు మాటిచ్చిన ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధికి రూ.3300 కోట్లు నిధులు మంజూరు చేశారని చెప్పారు. ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, లింకు రోడ్లు, శ్మశానవాటికల ఏర్పాటు వంటి వాటికి సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం ముమ్మిడివరం ఒఎన్‌జిసి పైపులైన్‌ ఏర్పాటులో బాధిత 23450 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.107.90 కోట్లు వారి ఖాతాలకు జమ చేశారు. దీనికి సంబంధించిన నమూనా చెక్కును బాధితులకు అందించారు. అలాగే అగ్రికల్చర్‌ కంపెనీ భూముల రైతులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందించారు. మత్స్యకారుల సంప్రదాయ వస్తువులైన వలకట్టు, చేతిబుట్ట, చేప నమూనా బొమ్మను ముఖ్యమంత్రి జగన్‌కు అందించి ఘనంగా సత్కరించారు.
జిల్లావ్యాప్తంగా బిజెపి నాయకుల అరెస్టు
జగన్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులను ఒకరోజు ముందుగానే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం వంటి ప్రధాన ప్రాంతాల్లో బిజెపి ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. దీనిపై బిజెపి తీవ్ర విమర్శలుచేసింది. సమాజంలో నిరసన తెలుపుకునే హక్కు అందిరకీ ఉంటుందని, వైసిపి ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసేలా ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు.