ఈ ఏడాది జిల్లాలో రైతులు ఆరుతడి పంటల వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారు. వరిసాగుకు సుముఖంగా ఉన్నప్పటికీ సరైన వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్‌లలో పూర్తి స్థాయిలో నీరు లేకపోవడంతో ఆరుతడి పంటల వైపు మెగ్గు చూపుతున్నారు. పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పూల మొక్కలు, కూరగాయల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో పత్తి పంట సాగుకు రైతులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో 70 వేల ఎకరాలకు పైగా పత్తి పంటను రైతులు సాగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మినుము, మొక్కజొన్న పంటలు అధికంగా సాగు చేసే చర్యలకు సిద్ధపడుతున్నారు.ప్రజాశక్తి - చాపాడు
కెసి పరిధిలో గతంలో వరి పంటను అధికంగా సాగు చేసే మండలాలైన చాపాడు, దువ్వూరు, మైదుకూరు, చెన్నూరు, ఖాజీపేట వల్లూరులలో సైతం ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోనే సుమారుగా 40వేల ఎకరాల వరకు వరి సాగు స్థానంలో ఇతర పంటలు సాగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరి ధాన్యం ధరలు బాగా ఉండటంతో సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. వరి పంట సాగుకు అవసరమైన నీరు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. కుందూ, పెన్నా, బ్రహ్మసాగర్ పరిధిలో అవకాశమున్న మేరకు రైతులు మాత్రం వరి పంటను సాగు చేశారు. కెసి పరిధిలో వరి సాగుకు ముందుగా పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసి ప్రస్తుతం చెడగొడుతున్నారు. ఆరుతడి పంటలకు సిద్దం చేస్తున్నారు. పత్తి పంటకు గత ఏడాది మంచి ధర పలకడంతో రైతులు పత్తి పంట సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరా పత్తికి రూ. 70 వేలకు పైగా ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. మొక్కజొన్న పంట సాగు చేపడితే ఎకరాకు మూడు టన్నుల దిగుబడి వచ్చినా టన్ను రూ. 20 వేల వరకు ధరలు ఉండడంతో మొక్కజొన్న సాగు వైపు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మొక్కజొన్న సాగుకు ఎకరాకు రూ 20వేల వరకు మాత్రమే ఖర్చులు అవుతాయని రూ. 40 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొం టున్నారు. జిల్లాలో మైలవరం, రాజుపాలెం, వేముల, తొండూరూ, విఎన్‌పల్లి, పెద్దముడియం మండలంలలో ఐదు వేల ఎకరాలకు పైగా, కొండాపురం, కలస పాడు, బి.మఠం, పోరుమామిళ్ల, ఖాజీపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, యర్రగుంట్ల , కమలాపురం, వల్లూరు మండలాలలో రెండు వేల ఎకరాల వరకూ ,మిగిలిన మండలాల్లో వంద ఎకరాల వరకు రైతులు పత్తి పంటను సాగుకు సమా యత్తమయ్యారు. మొత్తానికి ఖరీఫ్ లో జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేపట్టారు. సాధారణంగా ఎకరాకు 20 క్వింటాళ్ళ కు పైగా దిగుబడి వస్తుంది. దిగుబడి ఈ ఏడాది బాగుంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరా పత్తి పంట సాగుకు రూ. 45 వేల నుంచి 50 వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
మినుము సాగుకు సిద్దపడుతున్నాం
వరికి బదులు మినుము సాగుకు చర్యలు చేపడుతున్నాం. వరి సాగుకు ఏర్పాట్లు చేసి నీటి వసతి లేకపోవడంతో వెనకడుగు వేయవలసి వస్తుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాల్సి వస్తుంది. మినుము దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
- ఆంజనేయులు రైతు,సిద్దారెడ్డిపల్లె.
మినుము, జొన్న విత్తనాల కోసం ప్రతిపాదనలు
మండల పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేపట్టే రైతుల కోసం మినుము, జొన్న విత్తనాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. 800 క్వింటాళ్ల మినుము, 300 క్వింటాళ్ల జొన్న విత్తనాలు అవసరమని కోరాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా కెసి కాలువకు నీటి విడుదల ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వరి పంట సాగు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ముందు జాగ్రత్తగా విత్తనాలు సిద్దం చేస్తున్నాం. రైతుల అభ్యర్థన మేరకు మరిన్ని విత్తనాలు అవసరమైతే అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులకు అవసరమైన ఎరువులు ఆర్‌బికెలలో ఇప్పటికే సిద్ధంగా ఉంచాం.
- మ్యాగీ, ఎఒ, చాపాడు.










