Nov 14,2020 07:54

           ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్లో పండుగలది విడదీయరాని అనుబంధం. ప్రజల బతుకుదెరువులను, జీవనశైలిని, జయాపజయాలను, అణిచివేతలను, ఆధిపత్య ధోరణులను, విధేయతను, వివక్షతను, చారిత్రక నేపథ్యాలను పురోగమనంగానో, తిరోగమనంగానో ప్రతిబింబించేది ఒక రకంగా పండుగలే. విశ్వాసం, నమ్మకం ఆధారంగా పెద్దల వారసత్వాన్ని కొనసాగించేందుకు పండుగలను వీలైనంత గొప్పగా జరుపుకోవాలనే తపన సామాన్య ప్రజానీకానికి ఉంటుంది. అయితే ఏవి పండుగలు...ఏవి వంచనలు...అనేది చరిత్ర గతిని పరిశీలిస్తే కానీ బోధపడదు. నరకాసురుడిని వధించిన రోజు కాబట్టి నరక చతుర్దశి అని, రాక్షస వధతో అప్పటిదాకా చీకటి బతుకుల్లో వెలుగులు నింపింది కాబట్టి దీపావళి జరుపుకోవాలని ఇతిహాసాల ఉవాచ. నరకాసురుడు, మహిషాసురుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి అసురులను అంతమొందించి ఏడేడు పద్నాలుగు లోకాలను పరిరక్షించినట్లు మనువాద ఆర్యులు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజలను నమ్మించారు. అవే పండుగలన్నారు. కడగండ్లను, అరిష్టాలను, చీకట్లను పారదోలే పర్వ దినాలుగా వాటిని ఉద్ఘాటించారు. కానీ అత్యంత ప్రాచీనమైన హరప్పా నాగరికత అవశేషాల్లోకి అవలోకించినప్పుడు ఇందుకు భిన్నమైన వాదనలు తెర మీదకు వచ్చాయి. ఆర్య రాజులు అసురులుగా ప్రచారం చేసిన వారంతా వాస్తవానికి ఆదివాసీ తెగల రారాజులని అవగతమౌతోంది. ఇతిహాసాల్లోనే పేర్కొన్నప్పటికినీ నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు వీరంతా తమ తాతముత్తాలని, అలనాటి తమ రారాజులను ప్రతిబింబించే కథానాయకులని దళిత, ఆదివాసీ తెగలు చేస్తున్న వాదనకు తొలినాటి ఆనవాళ్లే బలం చేకూరుస్తున్నాయి. చెట్టు చాటు నుంచో, పుట్ట చాటు నుంచో లేదా ఇంకో రూపు దాల్చి అసురులను చంపడంలోనూ ఆర్య రాజుల వంచనలు అద్దం పడతాయి. అవే వంచనలు నేటికీ వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ఆ వంచనలే కొందరికి ఉద్దీపనలు, మరికొందరికి కారు చీకట్లు.
         దాదాపు ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 మహమ్మారి ఈ వైరుధ్యాన్నే తేటతెల్లం చేసింది. కార్పొరేట్‌ కంపెనీలకు వనరులను దోచిపెట్టి ప్రజలపై భారాలు మోపిన పెట్టుబడిదారీ దేశాలు, వాటికి వంత పాడిన వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభాల బాట పట్టిన వైనాన్ని చూశాం. కోవిడ్‌తో ఆ సంక్షోభాలన్నీ మరింత తీవ్ర రూపం దాల్చి ఆర్థిక మాంద్యం వైపు నెడుతున్నాయి. మన దేశం కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత ఆర్థిక మాంద్యాన్ని చవిచూస్తోందని రిజర్వుబ్యాంకు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకునే పేరుతో ఆత్మ నిర్భర్‌ భారత్‌ వంటి వివిధ దేశాలు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఆయా దేశాల్లోని కార్పొరేట్ల బొక్కసాలు నింపాయి కానీ పేదవాడి ఇంట మాత్రం చీకట్లను పారదోలింది లేదు. అదిగో ఇదిగో అంటూ నెల్లాళ్ల నుంచీ ఊరిస్తూ వచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా 2022 నాటికి కానీ అందుబాటు లోకి రాకపోవచ్చునని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా లాంటి అగ్ర దేశాలు కరోనాను ఎదుర్కొనలేక చేతులెత్తేస్తే సోషలిస్టు దేశాలైన చైనా, క్యూబా, ఉత్తర కొరియా, వియత్నాం వంటి దేశాలు కరోనాను అందరి కంటే ముందుగా కట్టడి చేసి సామ్యవాద వెలుగు దివ్వెలుగా నిలిచాయి. కరోనాను ఎదుర్కోవడంలో యావత్‌ దేశానికి దీపధ్వజంగా కేరళ నిలువగలిగిందంటే దానికి కారణం అక్కడ వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) అధికారంలో ఉండటమే. స్థూలంగా సంక్షోభంలో కూరుకుపోయిన పెట్టుబడిదారీ విధానానికి అసలైన ప్రత్యామ్నాయ వెలుగు దివిటీ సోషలిస్టు విధానాలేనని కోవిడ్‌ సంక్షోభం మరో మారు ప్రస్ఫుటం చేసింది.
        కోవిడ్‌ మహమ్మారి విజృంభించే అవకాశముందని వివిధ రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించాయి. పర్యావరణ హితమైన ఈ నిర్ణయానికి న్యాయస్థానాలు కూడా సమ్మతించాయి. ఇది మంచిదే. టపాసుల్లో కార్బన్‌ అధికంగా ఉండే గన్‌ పౌడర్‌, అలాగే సల్ఫర్‌, సీసం, పొటాషియం, సోడియం, కాపర్‌, బేరియం వంటి రసాయన మిశ్రమాలు వినియోగిస్తారు. ఇవన్నీ పర్యావరణానికి ప్రమాదకరమే. అమెరికా లాంటి దేశాల్లో వర్చువల్‌ టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవాలని ప్రవాస భారతీయులు నిర్ణయించారు. ఇదే చొరవతో టపాసులు తయారు చేసే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయాలు కూడా చేసి వుంటే బావుండేది. కొందరి జీవితాల్లో చీకట్లు నింపి ఇంకొందరు వెలుగులు పంచుకునేదీ ఏనాడూ పండగ కాబోదు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం సాగించేదే పర్వదినం. ఆ నాడే అసలైన దీపావళి. అలాంటి పర్వదినాలను ప్రతి రోజూ పూయించే సామ్యవాద ఉషోదయం కోసం వేచి చూద్దాం.