ప్రజాశక్తి-పర్చూరు: వైట్ బర్లీ పొగాకు దిగుబడితో పాటు ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. వైట్ బర్లీ నాటిన నుంచి ఈ ఏడాది మంచి ధరలు ఉంటాయనే నమ్మకానికి ఊతమిచ్చినట్లయింది. లోగడ ఎన్నడూ లేని విధంగా నాసిరకం పొగాకు కూడా క్వింటా రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు కూడా కొనుగోళ్లు సాగాయి. దీంతో నాణ్యమైన పొగాకుకు మంచి ధర వస్తుందని రైతన్నలు ఎంతో ఆశపడ్డారు. ఈ తరుణంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు వైట్ బర్లీ సాగు చేసిన పొగాకు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాయి. భారీ వర్షాల వల్ల చేలల్లో ఎండకట్టిన తాళ్లు తడిసిపోవటం, ఆకుల నుంచి మడ్డి కారిపోవడం వంటి కారణాలతో పంట దెబ్బతింది. ప్రైవేటు వ్యాపారులు దీనిని ఆసరాగా తీసుకొని ధరలను మరింత దిగజార్చి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైట్ బర్లీ పొగాకు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉన్నా నాశిరకం అనే పేరుతో ఉన్న ధరలను తగ్గించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేపడుతున్నారని వైట్‌బర్లీ రైతులు ఆందోళన చెందుతున్నారు. పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్‌లో 30 వేల ఎకరాల్లో రైతులు బర్లీ పొగాకు సాగు చేశారు. ఎకరానికి సాగు ఖర్చులు, పురుగు మందులు కలిసి మొత్తం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయితే పెట్టుబడులు ఎక్కువైనప్పటికీ ధరలు ఆశాజనకంగా ఉండటంతో వైట్‌బర్లీ వేసిన రైతులు కొంత ఊరట చెందారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల కురిసిన అధిక వర్షాలు వైట్ బర్లీ రైతులను కొంత ఆర్ధికంగా కుంగదీశాయి.
మద్దతు ధర ప్రకటించాలి
రైతు సంఘం జిల్లా నాయకులు బండి శంకరయ్య
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి వైట్ బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ప్రైవేటు వ్యాపారస్తులు ధరలు తగ్గించి కొనుగోలు చేయకుండా మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలి. మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే అన్నదాత ఆశలు అడియాసలయ్యే ప్రమాదం ఉంది.










