తుళ్లూరు: అసెంబ్లీ,సచివాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ పీఎఫ్,జీతం తక్షణమే చెల్లించాలని సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.భాగ్యరాజు డిమాండ్ చేశారు.ఈ మేరకు కార్మికులతో కలిసి గురు వారం సచివాలయం దగ్గర నుంచి మందడం సెంటర్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరాజు మాట్లా డుతూ, సచివాలయంలో పనిచేస్తున్న కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. త్రిబుల్ ఎస్ కంపెనీ వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఆరు నెలల పిఎఫ్ ఇవ్వలేదని, ప్రతినెల 5వ తేదీ లోపు జీతాలు ఇవ్వమని అడిగితే నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ కార్మికులకు జీతాలు సక్రమంగా అందడం లేదని అన్నారు.కార్మికులకు రూ.21 వేలకు జీతాన్ని పెంచాలని, కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కార్మికులు పిఎఫ్ , ఈఎస్‌ఐ, జీతాల విషయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వమే నేరుగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.










