Sep 22,2023 19:42

లడ్డు వేలంలో పాల్గొన్న పుర ప్రముఖులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో వైభవంగా గణేష్‌ నిమజ్జన మహోత్సవం సాగింది. అశేష జనవాహిని మధ్య గణేశుని శోభయాత్ర సాగింది. ఈనెల 18 నుంచి పూజలందుకున్న గణేశుని శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. పట్టణంలో సుమారు 450 విగ్రహాలు ప్రతిష్టించారు.
ఆలస్యంగా తరలిన విగ్రహాలు
పట్టణంలో ప్రతిష్టించిన విగ్రహాలు మధ్యాహ్నం 3 గంటల సమయం మీరినా తరలింపు ప్రక్రియ మొదలు కాలేదు. డిజెకు అనుమతి ఇవ్వడంతో విగ్రహ తరలింపు అర్ధరాత్రి వరకు సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శివ నారాయణస్వామి తెలిపారు. చిన్నహరివాణం ఎల్‌ఎల్‌సి కాలువలో గణేష్‌ నిమజ్జనం ఉండడం వల్ల అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎంపిడిఒ గీతావాణి పర్యవేక్షించారు.
పోటాపోటీగా లడ్డు వేలం
పట్టణంలోని గణేశుని శోభాయాత్రకు ముందు విహెచ్‌పి కార్యాలయం ముందు ప్రతిష్టించిన విగ్రహాన్ని ముందుగా నిమజ్జనానికి తరలించడం ఆనవాయితీ. అక్కడ గణేశుని ముందు ఉంచిన లడ్డు వేలానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వేలాన్ని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ ప్రారంభించారు. వేలం పోటాపోటీగా సాగింది. భారత్‌ గ్యాస్‌ యజమాని, కౌన్సిలర్‌ సందీప్‌ రెడ్డి లడ్డును వేలంలో రూ.1,10,116కు దక్కించుకున్నారు. పూజకు ఉంచిన లడ్డుకు వేలం నిర్వహించగా ఆర్‌సిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, వ్యాపారవేత్త శ్రీకాంత్‌ రెడ్డి రూ.40,116కు దక్కించుకున్నారు. ఈ వేలంలో వైసిపి నాయకులు జయ మనోజ్‌ రెడ్డి, టిడిపి నాయకులు గుడిసె కృష్ణమ్మ, పుర ప్రముఖులు చంద్రకాంత్‌ రెడ్డి, నీలకంఠప్ప, ఎగటి ప్రతాప్‌, కునగిరి నాగరాజు, కునగిరి నీలకంఠ, మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ ఇంజినీర్‌ నాగభూషణం రెడ్డి, కౌన్సిలర్లు సందీప్‌ రెడ్డి, అశోక్‌, బాలాజీ, కాంగ్రెస్‌ నాయకులు నీలకంఠప్ప, దేవిశెట్టి ప్రకాష్‌, విహెచ్‌పి నాయకులు బసవన్న గౌడ్‌, నాగరాజ్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ ఆచారి, నాగరాజు ఉన్నారు.