ఏమైంది కాలానికి
ఎందుకింతలా
మృత్యుగంట మోగిస్తోంది?
విషవైరస్ దాడితో
కారుమబ్బులు కమ్మిన నింగిలా
బతుకులన్నీ అంధకారమై
చిక్కుముడిపడుతూ
వేదనాభరిత వేకువలను
ఉదయిస్తున్నాయి
ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసినా
కనువిప్పు కలగక
సందేశాలెన్ని అందించినా
జాగ్రత్తలు పాటించక
మూర్ఖపు తీగలపై నడుస్తూ
నిర్లక్ష్యపు గుర్రాలపై సవారీ చేస్తూ
కాపుగాసిన రక్కసి సాలెగూటిలో
ఇరుక్కునే బదులు
మహమ్మారి నిన్ను కబళించకముందే
స్వీయరక్షణ పాటిస్తే
ప్రతికూల పరిస్థితిని గెలుస్తావని
గుర్తెరుగు ఓ మనిషీ!
భగభగ మండే సూరీడు లాంటి నిజం
కరోనా విశృంఖలంగా వ్యాప్తి చెందుతోంది
ఆదమరిస్తే విష కౌగిలిలో
బందీ కావటం తథ్యం!
ఎంత మహమ్మారయినా
కాలనదిలో కొట్టుకుపోవాల్సిందే
రేపటి ఆశలను పొదువుకొని
ఎన్నో ముచ్చట్లను దాచుకొని
తిమిరం కమ్మిన మనసులకు
వెలుగు దారులు చూపుతూ
ఆశా కిరణాలు రావడం తథ్యం
అంతదాకా జాగ్రత్తలతో
సంయమనం పాటిద్దాం
ఆశే శ్వాసగా జీవిద్దాం!
- వేమూరి శ్రీనివాస్
99121 28967