అంథకారంలో మగ్గుతున్న ఎన్‌టిఆర్ కాలనీ
కనీస సౌకర్యాలు లేక కాలనీ వాసుల ఇక్కట్లు
పేరును చూసి పట్టించుకోని ప్రజాప్రతినిధులు
తాజాగా పట్టాలు లేవంటూ అధికారుల మెలిక
నాలుగేళ్లలో ఇసుమంతైనా కానరాని అభివృద్ధి
పేరును చూసి పట్టించుకోవడంలే..!
ప్రజాశక్తి -ఆనందపురం మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కాలనీ అది. నాలుగేళ్ల క్రితం ఏర్పాటైన ఈ కాలనీలో తాగునీరు, విద్యుత్, ఇతరత్రా కనీస సౌకర్యాలు మచ్చుకైనా కానరావు. కాలనీ పేరులో ఎన్‌టిఆర్ అని ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు ఎంతగా గగ్గోలు పెడుతున్నా, అధికారులుగానీ,నేతలుగానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అంటూ గొప్పలు చెబుతున్న నేతలకు తమ కష్టాలు పట్టడం లేదని ఎన్‌టిఆర్ కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా, అప్పట్లో స్థలాలైతే మంజూరు చేశారేగానీ, పట్టాలు ఇవ్వనందువల్ల సౌకర్యాలు కల్పించలేకపోతున్నామంటూ అధికారులు కొత్త వాదన తెరపైకి తేవడం కాలనీవాసుల్లో ఆందోళన నెలకొంది.
2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 85 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, ఎన్‌టిఆర్ కాలనీ అని పేరు పెట్టారు. తమకు మంజూరైన స్థలాలలో దాదాపు పాతిక మంది లబ్ధిదారులు అష్టకష్టాలు పడి, నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారడంతో ఇక్కడికాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఈ కాలనీ ఉన్నప్పటికీ, ఎన్‌టిఆర్ అని పేరు ఉండడంతో విపక్ష కాలనీ అని అనుకున్నారేమో గానీ, అధికారులుగానీ, నేతలుగానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాలనీ ఏర్పాటై నాలుగేళ్లవుతున్నా, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీకి సిసి రోడ్లు , విద్యుత్ కనెక్షన్, తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టలేదు. దీంతో కాలనీవాసులు ఇన్నాళ్లుగా చీకట్లోనే జీవనం సాగిస్తున్నారు.
కాలనీ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు...
నాలుగేళ్లుగా కాలనీలో సౌకర్యాలను కల్పించాలని ప్రజాప్రతినిధులకు అనేకసార్లు వేడుకున్నామని, అయినా ఎవరూ స్పందించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. సరికదా, తెలుగుదేశం హాయంలో ఏర్పాటైన కాలనీలను రద్దు చేస్తామని స్థానిక సర్పంచ్ బెదిరించే వారని లబ్ధిదారులు వాపోతున్నారు. 85 ఇంటి స్థలాలను మంజూరు చేసినప్పటికీ, నీరు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అనేక ఇళ్లను పునాదుల స్థాయిలోనే నిర్మాణాలను ఆపేశామని అంటున్నారు. దాదాపు 25మంది నానా కష్టపడి, సుదూర ప్రాంతం నుంచి నీళ్లను తెచ్చుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నా, వాటిల్లో నివాసముండడానికి నానా అవస్థలు పడక తప్పడం లేదని వాపోతున్నారు. విద్యుత్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకుంటే, తమకు ఎలాంటి అధికారాలు లేవంటూ అధికారులు చేతులెత్తేయడంతో చీకట్లోనే మగ్గక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.
పరిశీలించి, పరిష్కరిస్తా
ఎన్‌టిఆర్ కాలనీలో మౌలిక వసతులు లేవనే విషయం ఇప్పటివరకు దృష్టికి రాలేదు. గ్రామ కార్యదర్శిని పంపించి, సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.
ఎంపిడిఒ లవరాజు
పట్టాలు లేనందున సౌకర్యాలకు అవకాశం లేదు...
2018లో 85 మందికి స్థలాల మంజూరు చేసినప్పటికీ, లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు లేని కాలనీకి అధికారికంగా మౌలిక వసతులు కల్పనకు ఎలాంటి అవకాశం లేదు.
గ్రామ కార్యదర్శి శ్రీరామ్మూర్తి










