May 18,2023 19:57

మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆదోని రైల్వే స్టేషన్‌ ప్రయాణికులకు అసౌకర్యాల నిలయంగా మారిందని నియోజవర్గ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యులు నీలకంఠప్ప, పట్టణ కాంగ్రెస్‌ కార్యనిర్వహణ అధ్యక్షులు దిలీప్‌ ఢోకా తెలిపారు. గురువారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రోజూ రూ.1.50 లక్షలకుపైగా ఆదాయం ఉన్నా ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం సున్నాగానే ఉందన్నారు. ప్లాట్‌ఫారంలో సౌచాలయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నీటి సౌకర్యం కూడా లేదన్నారు. అలాగే 4వ ప్లాట్‌ఫారంలో షెల్టర్‌ కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం లిఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మరిచిపోయారన్నారు. ఇటీవల ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి రైల్వే బోర్డు మెంబర్‌గా ఎంపికయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆదోని రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఆదోని రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని గుంతకల్లు రైల్వే డివిజన్‌ మేనేజర్‌ను కోరారు. లేకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మారుతి రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయినాథ్‌, యువజన నాయకులు దేవిశెట్టి వీరేష్‌ పాల్గొన్నారు.