ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగంలో అనేక సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నా, ఏళ్ల తరబడి సమస్యలు వెంటాడుతున్న అధికారులు గాని, ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలుండగా సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,250 పాఠశాలల్లో 1,46,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రైమరీ విద్యార్థులు 42,960 మంది, యుపి విద్యార్థులు 12,403, హైస్కూలు విద్యార్థులు 91,486 మంది ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 22 పోస్ట్ మెట్రిక్, 12 ప్రి మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మంది పిల్లలు ఏటా చేరుతున్నారు. బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 1058 మంది, 23 ప్రి మెట్రిక్ హాస్టళ్లలో 1,048 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
ఉదాహరణకు కొన్ని సమస్యలను పరిశీలిస్తే కాకినాడ జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి వస్తున్న సుమారు 800 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతుండగా సమస్యల నడుమ సాగుతున్నారు. పిఆర్ జూనియర్ కళాశాలలో మౌలిక సౌకర్యాలు లేమి పెద్ద సమస్యగా మారింది. పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్మనెంట్ అధ్యాపకులు నియమించి, నూతన తరగతి గదులను ఏర్పాటు చేయాల్సి ఉంది.
అన్నవరం సత్యదేవ డిగ్రీ కళాశాలలో సెమినార్ హాలు, డైనింగ్ హాలు, కళాశాలకు గ్రౌండ్ లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. శంఖవరం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల లేక ఇక్కడ విద్యార్థులు సూదుర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోనూ ఇదే సమస్య ఉంది. ఏళ్ల తరబడి జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో కళాశాల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏలేశ్వరంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు నిర్మించి, రెండు పూటలా కళాశాల నడిచే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. జగ్గంపేట ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు స్థలం కేటాయింపు నేటికీ జరగలేదు. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థుల సౌకర్యం కోసం బస్సు షెల్టర్ నిర్మించాల్సి ఉంది. ఎంతో చరిత్ర కలిగిన పెద్దాపురం ఎంఆర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. మౌలిక సౌకర్యాలైన కరెంటు, లైట్లు, ఫ్యాన్లు రక్షిత మంచినీరు కూడా లేని దుస్థితిలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సామర్లకోట జూనియర్ కళాశాలకు భవనం శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నూతన తరగతి గదులు ఏర్పాటు చేయాల్సి ఉంది. పిఠాపురం ఆర్‌ఆర్‌బిహెచ్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవనం నిర్మించాల్సి ఉంది. జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం లేక సమస్యల నడుమ చదువులు సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించాల్సి ఉంది. బెండపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాడు-నేడు పనులు ఏడాదిగా కొనసాగుగునే ఉన్నాయి. దీంతో ఆరుబయటే క్లాసులు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్‌లో ఉన్న ఎపిఎస్‌పి ప్రభుత్వ పాఠశాలలో ప్లస్-1, ప్లస్-2 చదువుతున్న విద్యార్థులకు మహిళా జూనియర్ కళాశాలకు నూతన భవనాలు లేవు. అధ్యాపకుల కొరత వేధిస్తోంది. బోట్ క్లబ్ మున్సిపల్ హైస్కూల్‌కు ఆటస్థలం లేక సమస్యలు తప్పడం లేదు. నగరంలో ఉన్న సాలిపేట, మదర్ థెరిసా, ముత్తానగర్ మున్సిపల్ హైస్కూల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. కత్తిపూడి ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ప్రభుత్వ బిసి కళాశాల బాలుర వసతి గృహంలో సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్న వాటికి తలుపులు లేవు. పెద్దాపురంలో ఉన్న ఎస్‌సి వసతి గృహానికి నూతన భవనాలు లేక శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నారు.










