Sep 21,2023 19:38

వినతిపత్రం అందిస్తున్న వ్యకాస నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
పేదలకు సాగు భూములపై హక్కు కల్పిస్తున్నామనే సాకుతో దళిత, బడుగు, బలహీన వర్గాలు, పేదల దగ్గర ఉన్న భూములను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం అసైన్‌మెంట్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ బిల్లును రద్దు చేయాలని వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం వ్యకాస జిల్లా కమిటీ పిలుపు మేరకు తహశీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల అనుభవంలో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకోవచ్చన్న చట్ట సవరణ ద్వారా పేదల భూములు రియల్‌ ఎస్టేట్‌, రాజకీయ పెద్దల చేతుల్లోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టసవరణపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు, వ్యకాస డిమాండ్‌ చేయగా ప్రభుత్వం కొన్ని నిబంధనలతో ఈ సవరణను ఆమోదించాలని అధికారులకు సూచించిందని తెలిపారు. చట్టసవరణను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిసిఎల్‌ ఏ నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూములు సాగు, అనుభవంలో ఉన్న వారి పేర్లను బహిరంగంగా సచివాలయం దగ్గర మొదటి దశలో ప్రదర్శించాలని కోరారు. ఆర్‌డిఒ, జెసి ద్వారా విచారణ చేపట్టి హక్కులు కల్పిస్తామన్న మాటలు క్షేత్రస్థాయిలో జరగడం లేదని తెలిపారు. చాలా భూమి కొంతమంది పెద్దల చేతుల్లో ఉందని చెప్పారు. సచివాలయాల్లో భూముల అనుభవదారుల పేర్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకొని చట్ట సవరణను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు ఆన్‌లైన్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రజా సంఘాల నాయకులు అశోక్‌, రంగన్న, కుమార్‌ పాల్గొన్నారు. ఆస్పరి తహశీల్దార్‌ మారస్వామికి వినతిపత్రం అందజేశారు. వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ, రైతుసంఘం మండల అధ్యక్షులు మధు రెడ్డి, వ్యకాస మండల నాయకులు రామాంజనేయులు, వెంకటేష్‌, రవి, బాలు, వీరేష్‌, మల్లి పాల్గొన్నారు.