అసైన్మెంట్ భూముల చట్ట సవరణ
ఆర్డినెన్స్ రద్దు చేయాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అసైన్మెంట్ భూముల చట్ట సవరణ ఆర్డినెన్స్ పేదలకు నష్టదాయకమని, దానిని వెంటనే రద్దు చేయాలని, భూమిలేని పేదలకు భూములు పంచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాలలోని సిపిఎం కార్యాలయంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అసైన్మెంట్ భూముల చట్ట సవరణ ఆర్డినెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యకాసం జిల్లా కోశాధికారి ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రమేష్ కుమార్, ఏ.రాజశేఖర్, దళిత బహుజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మేకల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మన్న, క్రిస్టియన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ జానయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మార్కు మాట్లాడారు. పేదలకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరగాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు 1955 నుండి దున్నేవాడిదే భూమి అని, భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్ల నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారన్నారు. అందులో 25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిందని, గతంలో పంచిన భూమి గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల చేతిలోకి వెళ్లిందన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఆందోళన చేయడం వల్ల అసైన్మెంట్ భూమి కొనడం, అమ్మడం జరగకుండా పిఓటి యాక్ట్ తీసుకువచ్చారని, కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసి భూములు పేదలకు దక్కకుండా భూస్వాములకు లాభపడేలా సవరణ చేయడం అన్యాయమన్నారు. దానిని వెంటనే విరమించు కోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న వేలాది ఎకరాల మిగులు భూములను తక్షణమే భూమి లేని పేదలకు పంచాలని, ప్రస్తుత చట్టం ప్రకారం పేదల భూములు వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తించిన అసైన్మెంట్ భూమిని, లబ్ధిదారుల లిస్టును బహిరంగంగా ఎమ్మార్వో ఆఫీస్ ముందు, సచివాలయం ముందు నోటీస్ బోర్డులో బహిర్గత పరచాలన్నారు. లేని పక్షంలో దళిత, గిరిజన ఇతర పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు ప్రభుత్వ భూముల్లో దిగి పేదలకు పంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బాలయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెన్నయ్య, వీరభద్రుడు, కరిముల్లా, రాజేశ్వరి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.










