మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో వైసిపి ఏకపక్ష విజయం హడావుడి ముగియక ముందే ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎ.పి సిఐడి నోటీసుల కలకలం మొదలైంది. ఎన్నికల ఫలితాలను మూడు రాజధానులకు ఆమోదంగా చెబుతున్న అధికార వైసిపి ఆ వేడి చల్లారక ముందే మరో దశ చర్యలు ప్రారంభించింది. గతంలో వేసిన అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుతో సంబంధం లేకుండా మరో స్థాయిలో దీన్ని ముందుకు తెచ్చారు. ఆ కేసులో హైకోర్టు స్టే కొనసాగుతుండగా సుప్రీం కోర్టు ఏప్రిల్ 7న పూర్తి స్థాయి విచారణ జరపనుంది. ఈ పూర్వరంగం లోనే ముందు జాగ్రత్తగా ఎస్.సి, ఎస్.టి అత్యాచార చట్టం కింద అసైన్డ్ భూముల సమస్యపై సిఐడి విచారణ చేపట్టి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని చెప్పొచ్చు. ఈ సమస్యపై వారు తనకు ఫిర్యాదు చేశారంటూ మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐడి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు హైకోర్టు చంద్రబాబుకు, మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన క్వాష్ పిటిషన్‌లో నెల రోజుల పాటు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్టే ఇచ్చింది. ఈ స్టే పిటిషన్‌దార్లకే వర్తిస్తుందని మిగిలిన దర్యాప్తునకు ఆటంకం కాబోదని వివరణ ఇచ్చింది. ఆలోగా సిఆర్‌డిఎ గత కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌నూ, ఫిర్యాదు చేసిన ఎంఎల్‌ఎ ఆర్కేను సిఐడి విచారించింది కూడా. రాజధాని ప్రకటనకు ముందు జరిగింది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాగా అధికారిక ప్రకటన ముందు, తర్వాత బహిరంగంగా నడిచింది అసైన్డ్ భూముల ప్రహసనం. అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చినవే గనక వాటికి పరిహారం అక్కర్లేదని ముందుగా చెప్పారు. నిరసనల తర్వాత ఏకమొత్తంగా ఇచ్చి తీసుకుంటామని జీవో తెచ్చారు. ఇవన్నీ మీరు తట్టుకోలేరని భయపెట్టడంతో చాలా మంది దళితులు తమ భూములను పాలకపక్ష పెద్దలకు అమ్మేసుకున్నారు.ఆ తర్వాత వారికి కూడా ఇతరులకు ఇచ్చినట్టే ప్లాట్లు ఇస్తామన్నారు. ఇందుకోసం 2015 జనవరి 1న జీవో ఎంఎస్1 తీసుకొచ్చారు. 2016 ఫిబ్రవరి 17న జీవో41, జూన్ 21న జీవో 259 మూడు ఉత్తర్వులు తెచ్చారు. తమను బెదిరించి మోసగించి భూములు తీసుకుని తర్వాత పరిహారం పెంచుకున్నారని అప్పట్లోనే దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.
దళితుల పోరాటాలపై నిర్బంధం..
ఇప్పుడు చంద్రబాబుపై కక్ష సాధింపుకోసమే ఇదంతా చేస్తున్నారని టిడిపి నేతలు వరుసకట్టి ఆరోపిస్తున్నారు.ఈ ఎఫ్‌ఐఆర్ హాస్యాస్పదంగా వుందని నిలవబోదని అంటూనే జైలుకు పంపించడానికే కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. కనుక ఇలా చెప్పడంలో టిడిపి ద్వంద్వత్వం వుంది. పాలక పక్షం మాత్రం తమకు ఎవరిపై కక్ష లేదనీ. న్యాయం కోసమే ఇవన్నీ చేస్తున్నామని సమర్థించుకుంటూ వుంది. ఇన్నిటి మధ్య ఈ నోటీసును గాని స్టేను గాని ఎలా చూడాలనేది కీలక ప్రశ్న. నోటీసులు కేసులు అన్నదానిలో రాజకీయ కోణం వుండవచ్చుగాని అసైన్డ్ భూమి స్వాధీనంలో మాయాజాలం జరగనేలేదని అంటే తప్పవుతుంది. అమరావతి అవకతవకలపై పోరాటమే అసైన్డ్ భూములతో మొదలైంది. సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ ప్రధానంగా అందుకు ఆధ్వర్యం వహించింది. మొదట దళితులు సాగు చేసుకుంటున్న భూములకు ప్యాకేజీ ఇవ్వబోమని చెప్పి ధర రాకుండా చేశారు. ఇతరులు కొనుక్కున్న తరువాత ప్యాకేజీ ప్రకటించారని ఇదెక్కడి న్యాయమని ఆ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు అప్పట్లోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ఇలాంటి భూములు కొనుగోలు చేశారనే అంశంపై ఉండవల్లి, పెనుమాక, ఐనవోలు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లో వ్యతిరేకత నెలకొంది. పూలింగు అనంతరం భూములు కొనుగోలు చేయడంపై దాదాపు అన్ని గ్రామాల్లోనూ తీవ్ర చర్చ జరిగింది. జరీబు గ్రామాలలో అసైన్డ్ భూముల వ్యవహారంపై తమను నమ్మించి మోసం చేశారనే అభిప్రాయం దళిత సామాజిక వర్గానికి చెందిన రైతుల్లో ఏర్పడింది. భూముల వ్యవహారంపై వచ్చిన వార్తల వల్ల తమకు నష్టం జరిగిందని పలువురు రైతులు 2015 ప్రారంభం లోనే మంగళగిరి, తుళ్లూరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు.అసైన్డ్, సీలింగు భూములకు పరిహారం, నిరుపేదలకిస్తామన్న రూ.2500 పెన్షనివ్వాలని తుళ్లూరులో రాస్తారోకోకు దిగిన పేదలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. నడిరోడ్డుపై ఈడ్చిపారేశారు. దీంతో తీవ్ర ఉద్రికత్తత ఏర్పడింది. సి.ఐ హనుమంతరావు నాయకులను, పేదలను అనేక విధాల దూషించారు. అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడమే గాక వార్తల కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను బయటకు నెట్టేసి గేట్లు పెట్టేశారు. 2015 ఆగష్టు 4న తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు ఆర్ అండ్‌బి రహదారిపై రాస్తారోకోకు దిగారు. హుటాహుటిన అక్కడకు పోలీసులు చేరుకుని ఆందోళన నిలిపేయాలని హుకుం జారీ చేశారు. నాయకులను లాగిపడేశారు. అరెస్టు చేసి జీపుల్లో ఎక్కించారు. స్థానిక మహిళలు, పేదలు, దళితులు జీపులకు అడ్డం పడ్డారు. వారినీ ఈడ్చిపడేశారు. ఈ క్రమంలో బాబూరావు, రవి, సుజానమ్మ, చిలకమ్మ, బెజ్జం మాధవరావుకు గాయాలయ్యాయి. అరెస్టుల విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు మధ్యాహ్నానికి పెద్దఎత్తున స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. బహిరంగ నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టటంతో మరొక దశలో ఎవరిళ్లల్లో వారే మూతికి నల్లగుడ్డలు కట్టుకుని 30 చోట్ల వందలాది మంది మహిళలు గృహదీక్ష చేపట్టారు. అసైన్డ్, సీలింగు భూముల లబ్ధిదారులకు పరిహారం చెక్కులివ్వాలని ప్రభుత్వం స్పందించే వరకూ పచ్చి మంచినీళ్లు కూడా తాగబోమంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా సిపిఎం క్రిడా కన్వీనర్ సిహెచ్. బాబూరావు మాట్లాడుతూ పేదలు, దళితులను భయపెట్టి వారి భూములు లాక్కుని అధికార పార్టీ పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు. 206 ఎకరాల భూములను 380 మంది పేద రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారని వాటికి ఇంతవరకు కౌలు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. లంకల్లో ఉన్న మరో 2000 ఎకరాల భూములనూ ఇచ్చేస్తామని ప్రకటనలు చేస్తూ పేదలను భయపెడుతున్నారని తెలిపారు.
ప్రపంచ బ్యాంకు విమర్శ, ఎస్.సి కమిషన్ ఆగ్రహం
రాజధాని ప్రాంత రైతులు భూ సమీకరణ విధానంలో తప్పులపై ఫిర్యాదు చేయడంతో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షక బృందం 2017 ఆగష్టు సెప్టెంబరు నెలల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించింది. అనేక మందిని కలుసుకుని ఫిర్యాదులు, విమర్శలు స్వీకరించింది. సమస్యలు ఆలకించింది. కొన్ని సమావేశాలలో కూడా పాల్గొంది. ఈ పర్యటనను సిఆర్‌డిఎ కూడా నమోదు చేసింది. భూసమీకరణ హడావుడిగా ఏకపక్షంగా జరిగింది గనక మరింత లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. నిజంగానే దీనివల్ల హాని కలిగే అవకాశముందని, విధాన సూత్రాలు పాటించలేదని హెచ్చరించింది. ప్రజలు చాలా తీవ్రమైన విషయాలే దృష్టికి తెచ్చారని కూలంకషంగా దర్యాప్తు జరిపితే తప్ప వాటిని నిగ్గు తేల్చలేమని పేర్కొంటూ ఒక నివేదిక ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. పునరావాసం, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత తదితర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెప్పినట్టు అందులో స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మికులు దారుణంగా నష్టపోయారని ఆవేదన వెలిబుచ్చింది. ఈ 102 పేజీల నివేదికను పరిశీలకులూ మీడియా వ్యాఖ్యాతలూ గమనించారు. అయితే కొద్ది రోజుల్లోనే దాన్ని వెబ్‌సైట్ నుంచి ఆదరాబాదరగా తీసి వేశారు. ఈ నిర్బంధానికి మీడియా పాక్షికత్వాన్ని కూడా జోడించి చూస్తే తప్ప పూర్తి చిత్రం బోధపడదు. అమరావతికి అంకురార్పణ కూడా జరగక ముందు నుంచే అనుకూల మీడియా అతిశయోక్తులు కుమ్మరించింది. స్థానికుల ఆందోళనలు, నిరసనలు, పోలీసు నిర్బంధం వంటి వార్తలు దాదాపు ప్రచురించలేదు. మరో విధంగానూ రాజధాని ప్రాంతంలో దళితులపై ప్రభుత్వ వేధింపులు సాగాయి. ఆ ప్రాంతంలో పర్యటించిన ప్రతిపక్ష నాయకులకు మద్దతిచ్చారనే ఉద్దేశంతో భూములను అమ్ముకోనివ్వకుండా ప్రభుత్వ వర్గాలు అడ్డుపడ్డాయి. కొనుగోలు చేసుకుందామని వచ్చిన వారినీ భయభ్రాంతులకు గురిచేయడం రాజధానిలో కనబడని సామాజిక వివక్షకు నిదర్శనంగా మారింది. రాజ్యాంగ సంస్థలు కూడా పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజధానిలో దళితుల సమస్యలపై జాతీయ ఎస్.సి కమిషన్ విజయవాడలో విచారణ నిర్వహించింది. దీనికి సభ్యులు పి.ఎం.కమలమ్మ హాజరయ్యారు. రాజధానిలో దళితులను ఉంచాలను కుంటున్నారా? ఇంకేమైనా చేద్దామనుకుంటున్నారా? అక్కడ దళిత ప్రజలకు స్థానం లేనప్పుడు రాజధాని ఎందుకు కడుతున్నారో చెప్పాలని ఎస్.సి కమిషన్ సిఆర్‌డిఏ అధికారులను ప్రశ్నించింది. దళితులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జీఓ నెంబరు 41 సస్పెండ్ చేసేందుకు సిఫార్సు చేస్తామని తెలిపారు. రాజధానిలో దళితులు ఎంతమంది, వారు ఎంత నష్టపోయారనే విషయంపై అధికారుల వద్ద సమాచారం లేదని తెలిపారు.
అమరావతికి రక్షణ, అక్రమాల సవరణ..
కనుక అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు మిథ్య, దళిత సమస్య మిథ్య అన్నట్టు మాట్లాడ్డం వాస్తవికం కాజాలదు. జెఎసి దీక్షలకు వ్యతిరేకంగా పోటీ దళిత దీక్షలు జరపడంతప్ప ఆ సమస్యలపై జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్దిష్టంగా తీసుకున్న పరిష్కార చర్యలు కూడా లేవు. హఠాత్తుగా మంగళగిరి ఎంఎల్‌ఎ ఆర్కే ఫిర్యాదుపై చంద్రబాబుకు సిఐడి నోటీసు ఇవ్వడం నాటకీయతకు కారణమైంది గాని సమస్య మూలాల్లోకి వెళ్లవలసిన అవసరం అలాగే వుంది. అమరావతిని కాపాడుకోవడమంటే గత ప్రభుత్వ హయాంలో పొరబాట్లను, అక్రమాలను సమర్థించడం కాదు. అసైన్డ్ భూములపై దశలవారీగా విడుదలైన జీవోలు, వాటివల్ల దళితులకు జరిగిన నష్టాలు నిగ్గు తేల్చి న్యాయం చేయడం ముఖ్యం. దళితులు నేరుగా ఫిర్యాదు చేయలేదనేది పెద్ద సమస్యగా చేయడం లేదంటే, సిఆర్‌డిఎ చట్టం సెక్షన్ 146 ప్రకారం రాజధాని కోసం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎవరిపైనా చర్యలు తీసుకోవడానికి లేదని సాంకేతికంగా సమర్థించుకోవడం చెల్లుబాటయ్యేవి కావు. వ్యక్తిగతంగా ఎవరి పాత్ర ఎంత, ఏ చర్యలు తీసుకోవాలనేది కోర్టులు తేల్చవచ్చు కాని తప్పులు చక్కదిద్దాల్సిందే. అయితే గత తప్పిదాలపై చర్యలు, అమరావతి ప్రతిష్టంభన పరిష్కరించి, రాజధానిగా కొనసాగించడం ద్వారా న్యాయం చేయడం వేర్వేరు అంశాలని ప్రస్తుత ప్రభుత్వం గ్రహించడం అవసరం.
* తెలకపల్లి రవి










