అసైన్డ్ భూముల పంపిణీ వ్యవహారం అందనిద్రాక్షను తలపిస్తోంది. ప్రభుత్వం ఇటీవల అసైన్డ్ భూముల సాగుదారులకు హక్కులు కల్పిస్తామనే పేరుతో 9-22 ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాలోని మండల రాజకీయ నాయకత్వం రాబంధుల అవతారం ఎత్తింది. అర్హులకు అసైన్డ్ భూములు పంపిణీ చేయాలనే ప్రభుత్వ ఆశయం దారి తప్పింది. ఆయా మండలాల రాజకీయ నాయకత్వాలు గ్రామాల్లోని పలుకుబడిన కలిగిన ధనికులకు, వారి సమీప బంధువులకు పాస్‌పుస్తకాల్లో ఎటువంటి భూములు లేవనే సాంకేతిక కారణాలను చూపించి, పెళ్లికాని యువకులు, పెళ్లయిన కుటుంబాల్లోని యువత పేర్లతో అసైన్డ్ భూములను కొట్టేయడం పరిపాటిగా మారింది. అసైన్డ్ కేటాయింపులకు సహకరించని తహశీల్దార్లపై దబాయింపులు, బెదిరింపులు, డిమోషన్లు, బదిలీలతో రాజకీయ నాయకత్వం గుప్పిట పట్టిన కారణంగా అర్హులకు అసైన్డ్ భూములను కేటాయించడం లేదనేది బహిరంగ రహస్యం.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో కడప, బద్వేల్, జమ్మలమడుగు, పులి వెందుల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. డివిజన్‌కు ఆరు వేల ఎకరాల చొప్పున సుమారు 25 వేల నుంచి 35 వేల ఎక రాల అసైన్డ్ భూములు ఉన్నట్లు అంచనా. సుమారు మూడు వేల ఎకరాలకు పైగా పంపిణీకి సిద్ధం చేసినట్లు సమా చారం. ఇటీవల పులి వెందుల మండలాల్లో అసైన్డ్ భూములను అనర్హులకు కేటాయించారనే వివరాలు బయటికి పొక్కడం రాజకీయ సెగలు పుట్టించింది. అనర్హులకు, ఉద్యోగుల పేర్లతో భూముల కేటాయింపులు చేయడం పెద్ద ఎత్తున చర్చనీ యాంశమైంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వివాదా స్పదంగా మారిన మండ లాల్లో రీసర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
తహశీల్దార్లకు తప్పని వేధింపులు
జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో 36 మండలాలు ఉన్నాయి. ఇందులోని అర్హులైన పేదలకు ఎనిమిదో విడత అసైన్డ్ భూసేకరణ, అర్హులు గుర్తింపు, భూముల కేటాయింపు వ్యవహారాలల్లో తహశీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగంపై రాజకీయ నాయకత్వం కన్నేసింది. ఆయా మండల అధికార యంత్రాంగాన్ని గుప్పిట పట్టింది. తాను చెప్పిన వారికి అసైన్డ్ భూములను కేటాయించాలని హుకుం జారీచేస్తోంది. చేసేదేమీ లేకపోవడంతో కొంత మంది తహశీల్దార్లు రాజీపడి రాజకీయ నాయకత్వం చెప్పినట్లు చేయడం అని వార్యంగా మారినట్లు తెలు స్తోంది.
అక్కడికి బదిలీ చేస్తే సెలవుపై వెళ్లాల్సిందే!
జిల్లాలోని బ్రహ్మం గారిమఠం, వీరపు నాయునిపల్లి తహ శీల్దార్లుగా వెళ్లడం సవాలుగా మారింది. రెవెన్యూ భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడం, రాజకీయ నాయకత్వాలు ఒత్తిడి కారణంగా సెలవులపై వెళ్లాల్సి వస్తోందనే వాదన వినిప ిస్తోంది. ఇటీవలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ల పనితీరుపై విమర్శలు వచ్చిన సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్పందించి సదరు ప్రాంతాలకు ఎంతటి సీనియారిటీ కలిగిన అధికారులను పంపించినప్పటికీ విమర్శలే వస్తున్నాయనంటే అర్థమేమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్ధం పడుతోంది.
బెదిరింపు చర్యలతో హల్‌చల్
ఓ డిప్యూటీ తహశీల్దార్‌ను ఏడాది వ్యవధిలో ఆరుసార్లు బదిలీ చేయడం గమనార్హం. ఆర్నెళ్ల కిందట బ్రహ్మంగారిమఠం డిప్యూటీ తహశీల్దార్‌పై అధికార పార్టీకి చెందిన మండల నాయకత్వం భౌతిక దాడికి దిగే తరహాలో వీరవిహారం చేయడం తెలిసిందే. అనంతరం రాజకీయం చేసి డీమోట్, బెదిరింపులు, బదిలీలు వంటి సీన్లతో ఎపిసోడ్‌ను రక్తి కట్టించింది. వీరపునాయునిపల్లి, పెండ్లిమర్రి మండలాల్లోని కొండలు, ఒంటిమిట్ట మండల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని సారవంతమైన వందలాది ఎకరాల పిఒటి భూములు, కాశినాయన, పోరుమామిళ్ల మండల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లోని కడప, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఉంటున్న ధనవంతులు అసైన్డ్ భూములను కొట్టేయడం గమనార్హం.
అసైన్డ్ వివరాలు వెల్లడించలేం
అసైన్డ్ భూముల వివరాలు బయటికి వెళ్లడించలేం. ఇటీవల ప్రసార మాధ్యమాల్లో అనర్హులకు అసైన్డ్ భూములు కేటాయించారనే వార్తలు రావడంతో రీసర్వేకు ఆదేశించడమైంది.
- గంగాధర్‌గౌడ్, డిఆర్‌ఒ, కడప.