ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతి గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ప్రభుత్వం తక్షణమే కౌలు చెల్లించాలని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. ఉద్దండరాయునిపాలెం రైతు దీక్షా శిబిరం వద్ద అసైన్డ్ రైతులు బుధవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అసైన్డ్ రైతు పులి చిన్నా మాట్లాడుతూ దళితులు, ఇతర పేద వర్గాలకు చెందిన అసైన్డ్ రైతులకు ప్రభుత్వం విచారణ పేరుతో కౌలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు లేవని, ప్రత్యమ్యాయ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో అసైన్డ్ రైతుల కుటుంబాలు రోజు గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. తక్షణమే కౌలు చెల్లించాలని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న దీక్షలు బుధవారంతో 1303వ రోజుకు చేరాయి. తుళ్లూరు, అనంతవరం, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, నెక్కల్లు తదితర గ్రామాల్లో దీక్షలు సాగాయి. అమరావతి వెలుగులో భాగంగా కొవ్వొత్తులు వెలిగించి బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేశారు.










