కడప అర్బన్ : ప్రభుత్వ భూములు అమ్ముకోవచ్చు అనే ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. శివకుమార్, అన్వేష్ డిమాండ్ చేశారు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, పేదలకు నష్టం కలిగించే అసైన్డ్ ఆర్డినెన్సు రద్దు చేయాలని ఈనెల 20 న ఉదయం 10 గంటలకు కడప సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశానికి జిల్లాలో ఉన్న ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, వామపక్ష నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు 20 సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు కల్పిస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వ్యతిరేకించారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత మాట మార్చి మడమతిప్పి పదేళ్లకే ఇళ్ల స్థలాలు, 20 సంవత్సరాలకు సాగు భూములు రిజిస్ట్రేషన్ చేపడతామని రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదించటం, గవర్నర్ చేత ఆగమేఘాల ఆర్డినెన్స్ తీసు కురావడం చాలా అన్యాయమన్నారు. ఇప్పటికే దళితులు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు వేల ఎకరాలు అన్యాక్రాం తమయ్యాయని పేర్కొన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి ఉండగా సంఘం పోరాట ఫలితంగా 9/77 అసైన్డ్ చట్టపకారం కొన్ని భూములు తిరిగి పేదలకు ఇచ్చారని తెలిపారు. భూములు అమ్మకూడదు, కొనకూడదు అనే చట్టం ఉన్నప్పుడు వేలాది ఎకరాలు అన్యక్రాంతమైతే రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ చట్టాన్ని సవరించటం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పెద్దలకు, భూస్వాములకు, భూ కబ్జాదారులకు ఉపయోగపడేలాగా ఆర్డినెన్స్ తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.










