Aug 06,2023 23:36

ప్రజాశక్తి - తాళ్లరేవు అసైన్డ్‌ భూములను అమ్ముకొనవచ్చు అనే ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన తాళ్ళరేవు ప్రజా సంఘాల భవనంలో ఆదివారం నిర్వహించారుర. ఈ సమావేశంలో కార్యక్రమాల రిపోర్టును సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌ ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు చర్చించారు. అనంతరం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలు దళితులకు, బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సంఘం పోరాట ఫలితంగా 9/77 అసైన్డ్‌ చట్ట ప్రకారం కొన్ని భూములను తిరిగి పేదలకు ఇచ్చారని తెలిపారు. అసైన్డ్‌ భూములు అమ్మకూడదు, కొనకూడదు అనే చట్టం ఉన్నప్పుడే వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైతే ఇప్పుడు రాజశేఖర్‌ రెడ్డి కుమారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అసైన్డ్‌ చట్టాన్ని సవరించి 20 సంవత్సరాలు దాటిన భూములను అమ్ముకొనవచ్చని, చట్ట సవరణ చేసి రాష్ట్ర గవర్నర్‌ ద్వారా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆర్డినెన్స్‌ తెచ్చారన్నారు. ఇదే అమలు జరిగితే దళితులు, బలహీన వర్గాల ప్రజల వద్ద సెంటు భూమి కూడా మిగలదని ఇది చాలా అన్యాయం అని, వెంటనే ఈ ఆర్డినెన్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కూరాకుల సింహాచలం, దుప్పి అదష్టదీపుడు, చొల్లంగి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
కాకినాడ : భూమి లేని గ్రామీణ పేదలు, దళితుల అభ్యున్నతి, ఆత్మగౌరవం, జీవనోపాధి కోసం ఇచ్చిన అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చని ప్రభుత్వమే ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖందించింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అసైన్డ్‌ చట్ట సవరణపై అన్ని రాజకీయ, వ్యవసాయ కార్మిక, దళిత సంఘాలతో చర్చించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆర్డినెన్స్‌ ఉపసంహరించుకోవాలన్నారు. అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూముల వివరాలు గ్రామ సచివాలయంలో బహిరంగ పరచాలన్నారు. రానున్న నెల రోజుల్లోపు అసెంబ్లీ సమావేశాలు ఉండగా ఆగమేఘాలపై ఎవరి ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ నిర్ణయం చూస్తుంటే దళితులు, ఇతర పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను పెత్తందార్లకు కట్టబెట్టడానికే 9/77 చట్టాన్ని సవరించారన్నారు. మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనల ఫలితంగా సుమారు 32 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందన్నారు. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్లు కోనేరు రంగారావు భూ కవిటీ చెప్పిందన్నారు. ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమిని అనేక చోట్ల భూస్వాములు, పలుకుబడి కలిగిన వారు పారిశ్రామిక కేంద్రాలు, ఆక్వా చెరువులు, విద్యాలయాలు, నేషనల్‌ హైవేలు, విమానాశ్రయాలుకు పక్కనున్న దళితులకు చెందిన అసైన్డ్‌ భూములను దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. ఈ చట్టం ఉండబట్టే భూములు కోల్పోయిన పేదలు పోరాడి లేదా న్యాయస్థానాలను ఆశ్రయించి తిరిగి పొందుతున్నారన్నారు. సవరించిన సెక్షన్‌ 3లో అసైన్డ్‌ భూమి మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్కన వ్యవసాయేతర అవసరాల కోసం (పరిశ్రమలు, విద్యాలయాలు, ఆక్వా, ఇతరములు) ఆక్రమించుకున్నట్లయితే ఆ భూములకు మార్కెట్‌ రేట్‌ ప్రకారంగా అసైన్డ్‌దారులకు డబ్బు చెల్లించాలని సవరణ చేశారన్నారు. ఈ సవరణ ద్వారా ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను ఇలాంటి తప్పుడు పద్ధతుల పేరుతో పేదల భూములను రాజమార్గంలో కొట్టేయడానికి భూస్వాములకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. భూములు అమ్ముకోమని ప్రొత్సాహించడం అభివృద్ధి నిరోధక చర్య అనితప్పు పట్టారు. ప్రభుత్వం తెచ్చిన సవరణ,అసైన్డ్‌ భూముల హక్కుదారుల కంటే, అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములకు మేలు చేస్తుందన్నారు.