పుట్టపర్తి అర్బన్ : అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పనకు ప్రణాళికలు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జిల్లాలోని వివిధ మండలాల అధికారులతో డిఆర్‌ఒ కొండయ్యతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో రెవెన్యూ అంశాలైన రీ సర్వే, అసైన్డ్ భూములు, వ్యవసాయ శాఖ, జగనన్న పాల వెల్లువ, పశు సంవర్దక శాఖ, పంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కింద ప్రాధాన్యతా భవనాల పురోగతి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇంటింటి ఓటర్లసర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేరెండవ విడతలో భూముల రీ సర్వే పూర్తి అయిన వాటిలో రాళ్లు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. సంబంధిత తహశీల్దార్లు, సర్వే సిబ్బంది ఈ పనుల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. భూమిలేని దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలను గుర్తించి వారికి అసైన్డ్ భూమి యాప్ నందు నమోదు ప్రక్రియ పూర్తిచేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆమోదంతో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన కార్యక్రమానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ కార్యక్రమంను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరినీ జాబితా నుంచి తొలగించరాదన్నారు. ఇంటింటికి ఓటర్ల సర్వే ఈనెల 21వ తేదీ నాటికి వందశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్‌లు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ఉపాధి హామీ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ క్రాప్ నమోదును పూర్తి స్థాయిలో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, ఎస్‌సిపిఆర్ గోపాల్ రెడ్డి, డీఎంహెచ్వో ఎస్‌వి.కృష్ణారెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్సీ రషీద్ ఖాన్, సిపిఒ విజరు కుమార్ తెలిపారు.










