ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలో అసైన్డ్ భూముల పంపిణీకి సంబంధించిన వివరాలు జూలై నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని తహసిల్దార్లు, అటవీ అధికారులు, సర్వేయర్లు, విఆర్‌ఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ, లబ్దిదారుల వివరాలు ఆన్లైన్ చేయడం, తప్పులను సిద్దడం, ఎవరి పేరున పట్టా అవసరం వంటి వివరాలు గ్రామ సభల ద్వారా సేకరించి, గ్రామాలలో విచారణ జరిపి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇటీవల జిల్లా ఇంచార్జ్ మంత్రి 2,550 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ పంపిణీకి ఆదేశించిన నేపధ్యంలో 45 రోజులలో వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విఆర్‌ఓలు తప్పనిసరిగా సచివాల యాలలోనే పని చేయాలని, తహసిల్దార్ కార్యాలయానికి అవసరమైతే తప్ప వెళ్ల కూడదని ఆదేశించారు. జిల్లాలో నోటరీ అనేది లేదని, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని మ్యుటేషన్లు, తదితర ధ్రువపత్రాలు జారీ చేయాలని సూచించారు. తహసిల్దార్లు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేయరాదని ఆదేశించారు. తనిఖీలలో విధులకు సక్రమంగా హాజరు కానట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోడం జరుగుతుందని హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే తహసిల్దార్లకు కూడా నోటీసులు జారీ చేస్తామని, మూడు నోటీసులు అందుకున్న వారు క్రమశిక్షణా చర్యలకు భాద్యుల వుతారని స్పష్టం చేసారు. జిల్లాలో 2,265 సెల్ టవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలక్టర్ జే.శివ శ్రీనివాసు, సర్వే భూ రికార్డుల ఎడి మోహనరావు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారులు వి.అభిషేక్, సూరజ్ గనోరే, సబ్ కలక్టర్ శుభం బన్శాల్, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.










