Aug 20,2023 21:48

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న బి. నారాయణ

కడప అర్బన్‌ :
దళిత, గిరిజన, పేదలకు నష్టం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అసైన్డ్‌ భూముల చట్ట సవరణ ఆర్డినెన్స్‌ రద్దు చేయాలని వ్యక్తలు డిమాండ్‌ చేశారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు శివకుమార్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ పోరాట సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు బి.నారాయణ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు బండి జకరయ్య, బిఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జీ గుర్రప్ప, సిహెచ్‌ఆర్‌డి శివారెడ్డి, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్‌.వి.ప్రసాదరావు, ముస్లిం మైనార్టీ నాయకులు దస్తగిరి, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు దేవ శ్రీకృష్ణ, గిరిజన టీచర్చర్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాసులు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మునెయ్య, ఎస్‌సి, ఎస్‌టి హ్యుమన్‌ రైట్స్‌ అధ్యక్షులు జె.వి.రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళితులు భూములను పెత్తదార్లకు దారతత్తం చేసేందకు ఆసైన్డ్‌ భూముల చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద దళుతుల భూములను కారుచౌకగా అగ్రవర్ణాల వారు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గరిష్ట భూ పరిమితి చట్టం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములు కొనుగోలు చేయకూడదు, అమ్మకూడదని చట్టంలో ఉన్నా అగ్రవర్ణాలవరూ భయపెట్టి, బెదిరించి స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పారు. సావిశెట్టిపల్లె, అక్కెంగుడ్ల ప్రాంతంలో వేలాది ఎకరాలు బడా నాయకులచేతిలో ఉన్నాయని తెలిపారు. పేదలకు భూములు ఇమ్మంటే లేవని చెప్పే ప్రభుత్వం, తహశీల్దార్డు పెద్దలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెడుతూ పాసుపుస్తకాలు కూడా ఇస్తున్నారని విమర్శించారు. అగ్రవర్ణాల చేతిలో ఉన్న దళి,పేద, బడుగు,బలహీన వర్గాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి బడా నాయకులకు వేల ఎకరాలు భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. నవరత్నాల పేరుతో దళితలకు వచ్చే 35 నుంచి 40 పథకాలు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని, చట్ట సవరణ ఆర్డినెన్స్‌ రద్దు చేసే వరకు కమిటీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. అప్పుడే పేదలకు భూమి దక్కుతుందని తెలిపారు. పేదల భూములను పెద్దలకు కట్టబెట్టేందుకు కొంత మంది తహశీల్దార్లు, విఆర్‌ఒలు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. భూమి అగ్రవర్ణాల అనుభవంలో ఉంటే వారికి ఆన్‌లైన్‌ చేసి పాసుపుస్తకాలు ఇస్తున్నారని తెలిపారు. పేదలు అడిగితే సెంటు భూమికూడా లేదంటున్నారని విమర్శించారు. మూడుపులు ఇచ్చేవారికే ప్రభుత్వ భూములు దక్కుతున్నాయని చెప్పారు. పేదలకు మొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు పాపిరెడ్డి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, అంజి, వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.