ప్రజాశక్తి - కలిదిండి
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టంపై తీసుకువచ్చిన ఆర్డినెన్సు రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత సంఘాల అధ్వర్యంలో దళితుల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 29వ తేదీన విజయవాడలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మాలమహానాడు మండల అధ్యక్షులు ఈదా పద్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం భూయాజమాన్య హక్కు పేరుతో దళితుల భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నంలో ఉందన్నారు. ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్ నిధులను, ఇతర పథకాలకు మళ్లిస్తూ దళితులకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత మతం పేరుతో, కులం పేరుతో దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. దళితరక్షణ యాత్రల పేరుతో దళిత పేటలలో ప్రచారాలు నిర్వహించి, సంతకాల సేకరణ చేపడతామని వక్తలు తెలిపారు. 29 వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు చిన్నం శ్రీకాంత్, కుడిపూడి శ్రీనివాసరావు, పంతగాని ప్రకాష్, గోసంగి వినోద్, గూట్ల జయరాజు, నేలపూడి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.










