
పెద్దల చేతుల్లోనే పేదల భూములు
జిల్లాలో 63,220 ఎకరాలు పంపిణీ
మొత్తం 54,682 మంది లబ్ధిదారులు
ప్రస్తుతం భూముల్లో ఉన్న లబ్ధిదారులు నామమాత్రమే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూములు పొందిన లబ్దిదారుల చేతుల్లో ప్రస్తుతం ఉన్న భూములు నామమాత్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం చేసిన అసైన్డ్ చట్టంలోని మార్పులతో వేలాది ఎకరాల పేదల భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. 20 ఏళ్లక్రితమే అసైన్డ్ భూములకు బి-ఫారం పట్టాలు పొందిన వాస్తవ లబ్ధిదారులు, వారసుల స్వాధీనంలోకి అసైన్డ్ భూములపై పూర్తిహక్కులు కల్పిస్తామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ క్రమంలో పంపిణీ చేసిన భూములు ఎవరిస్వాధీనంలో ఉన్నాయో నిర్ధారించేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఇప్పటి వరకూ జరిపిన పరిశీలనలో భూముల లెక్కలు, లబ్ధిదారుల లెక్కలు తెల్చిన అధికారులు, అవి ఎవరిస్వాధీనంలో ఉన్నాయో తేల్చేపనిలో నిమగమయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మూడొంతులకు పైగా పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌భూములు పెద్దల చేతుల్లోకి చేరిపోయినట్లు తెలిసింది. ఏలూరు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 27 మండలాలున్నాయి. 2003కు ముందు పంపిణీ చేసిన అసైన్డ్‌భూములు ఏలూరు డివిజన్‌లో 19,575 ఎకరాలు ఉండగా లబ్దిదారులు 19,390 మంది ఉన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 23,051 ఎకరాలు భూమి పంపిణీచేయగా 15,536 మంది లబ్ధిదారులున్నారు. నూజివీడు డివిజన్‌లో 20,595 ఎకరాల అసైన్డ్‌భూమి పంపిణీ చేయగా 19,756 మంది లబ్ధిదారులున్నారు. ఏలూరు జిల్లామొత్తంగా 63,220.5 ఎకరాలు భూమి పంపిణీ జరగ్గా మొత్తం 54,682 మంది లబ్దిదారులకు ఇచ్చినట్లు లెక్కతేలింది. ఇంత పెద్దమొత్తంలో పేదలకు భూమి పంపిణీ జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం పేదల చేతుల్లో ఆ భూములు లేకుండా పోయాయి. మూడొంతులకు పైగా భూమి బడాబాబులు చేతుల్లోనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అసైన్డ్, సీలింగ్ వంటి భూములకు సంబంధించి క్రయవిక్రయాలు చెల్లవు. ఈ భూముల పంపిణీ కోసం సిపిఎం వంటి వామపక్ష పార్టీలు జిల్లాలో అలుపెరుగని పోరాటంచేసిన ఉదంతాలున్నాయి. పేదల అసహాయాతను అసరాగా చేసుకున్న గ్రామాల్లోని పెద్దలు పది, పరక చేతిలో పెట్టి పేదల భూములను స్వాధీనం చేసుకుని స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. చేపల చెరువులు తవ్వేసి పెద్దఎత్తున ఆదాయం గడిస్తున్నారు.
మెట్టప్రాంతంలో పామాయిల్ వంటి పంటలను పండిస్తున్నారు. తమభూములు తమకు ఇవ్వాలని పలుచోట్ల పేదలు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. దెందులూరు మండలం దోసపాడు గ్రామంలో దళితులకు చెందిన దాదాపు 155 ఎకరాల ఆసైన్డ్ భూమిని విజయవాడకు చెందిన బడాబాబులు సొంతం చేసుకుని చేపలచెరువులు తవ్వేసి అనుభవిస్తున్నారు. తమభూములు తమకు ఇవ్వాలంటూ దళితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. టి.నరసాపురంతో పాటు పలు మండలాల్లో భూపోరాటాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అసైన్డ్ చట్టంలో చేసిన మార్పులు బడాబాబులకు అనుకూలంగా ఉండటంతో పేదల భూములు పెద్దలపరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే పంపిణీచేసిన అసైన్డ్ భూములన్ని పట్టాదారులులకు, లేదావారి వారసులకు అందించాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.