ప్రజాశక్తి-పాడేరు: ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఆశావర్కర్లుగా తమను గుర్తించక పోవడంపై అల్లూరి జిల్లాలోని సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు)( సిహెచ్‌డబ్ల్యు)లు ఆవేదన చెందుతున్నారు. పాతికేళ్ల క్రితం పాడేరు ఏజెన్సీలో వ్యాధులు చుట్టుముట్టి వైద్య సేవలు అందని పరిస్థితుల్లో సతమతమైన మారుమూల ప్రాంతాల గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు సామాజిక ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. తాము అందించే సేవలకు సరైన వేతనం పొందలేని పరిస్థితుల్లో తరచూ ఆందోళన బాట పడుతున్నారు. అయినప్పటికీ వారి పట్ల పాలన యంత్రాంగం చిన్న చూపు చూస్తోంది.
ఏజెన్సీలోని ప్రతి గ్రామానికి ఒక సామాజిక ఆరోగ్య కార్యకర్తను 2000 సంవత్సరానికి ముందే సుమారు మూడు వేల మంది నియమితులయ్యారు. తర్వాత దపదపాలుగా ఈ సామాజిక ఆరోగ్య కార్యకర్తల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఇందులో 3,200 మందికి శిక్షణ ఇచ్చి ఆశా వర్కర్లుగా ఆప్‌గ్రేడ్ చేశారు. వీరిలో ఇంకా 752 మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ఆశా వర్కర్లుగా గుర్తించ లేదు పదేళ్ల క్రితమే వీరంతా నియమితులయ్యారు. పాడేరు డివిజన్‌లో 11 మండలాల పరిధిలో పలుచోట్ల వీరు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో వీరికి ఇచ్చే పారి తోషికం చాలా తక్కువ. నెలకు రూ.4వేల వేతనం ఇస్తున్నారు. ఆశాల శిక్షణ పొందిన సిహెచ్‌బ్ల్యులకు ఆశా వర్కర్ల అర్హత లేక పోవడంతో వేతన విషయంలోనూ వివక్షకు గురవుతున్నారు. అలాగే సామాజిక ఆరోగ్య కార్యకర్తలు పలు సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. పల్స్ పోలియో పారితోషికం సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు.
జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట మండలాల్లో కొందరు సిహెచ్‌బ్ల్యులకు మూడు సంవత్సరాల పల్స్ పోలియో బకాయిలు చెల్లించ లేదు. మరికొన్ని పీహెచ్సీల పరిధిలోని సిహెచ్‌బ్ల్యులకు వేతన బకాయిలు కూడా ఉన్నాయి. యూనిఫామ్‌లు వీరికి పంపిణీ కాలేదు. యూనిఫామ్ వీరు స్వంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో, అదనంగా ఆర్థిక భారం ఎదుర్కోక తప్పడం లేదని సిహెచ్‌డబ్ల్యులు వాపోతున్నారు. తమకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్నామన్నారు. ఆశా వర్కర్ల గా గుర్తించి నెలకు పది వేల వేతనంతో పాటు యూనిఫామ్, బీమా సౌకర్యం కల్పించాలని, గ్రామాల్లో జనాభాకు తగ్గట్టుగా తమకు మందులు పంపిణీ చేయాలని సామాజిక ఆరోగ్య కార్యకర్తలు కోరుతున్నారు.










