ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రజానీకం ఒకింత అశాంతితోనూ, ఆందోళనతోను ఉన్నారు. నిరసన కార్యక్రమాలు పెల్లుబుకు తుండడం ఇందుకు తార్కాణమని పలువురు ఉదహరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఎవరి దారి వారిది అన్నట్టుగా జగనన్న సురక్ష, నియోజకవర్గాల సమీక్ష, తదితర కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తోంది. దీంతో, సమస్యలు మరింత జఠిలమైన ఆందోళనలు తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ముందుకు వచ్చిన అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే... జీడి, చెరకు రైతులు మద్ధతు ధర కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన కదురడం లేదని జనం చర్చించుకుంటున్నారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూనే రైతులకు మద్ధతు ధర, మార్కెటింగ్ సదుపాయం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం రైతు బజార్లతో దుకాణ అద్దెలు సైతం ప్రభుత్వం అమాంతంగా పెంచేసిందంటూ గుర్తు చేస్తున్నారు. వేతనాలు పెంచాలంటూ జిల్లా వాప్తంగా విఆర్‌ఎలు నిరవదిక నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.10,500 ఎలా సరిపోతాయని, ఈ వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు. దీనికితోడు సంక్షేమ పథకాలు సైతం వర్తింపజేయకపోవడంతో ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని వారి వాదన. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 7న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 25న విజయవాడలో నిరసన దీక్షలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు తమకు పాఠపుస్తకాలు ఇవ్వాలంటూ ఇంటర్ విద్యార్థులు రోడ్లు ఎక్కారు. వీరికి మద్ధతుగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెడికల్ కాలేజీ సాకారమైన తరుణంలో 50శాతం సీట్లు విక్రయానికి పెట్టడంతో వైద్య వృత్తికోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. నాడు - నేడు పనులు ముందుకు సాగకపోవడంతో చాలా స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో గుత్తేదారులు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ ఉపాధ్యాయులు కూడా ఆందోళన బాటపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ కక్షలతో జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడ్ని హతమార్చడంతో ఉపాధ్యాయులతోపాటు జిల్లా ప్రజానీకం ఉలిక్కిపడింది. ఇలా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో చలగాటమాడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తునారు.










