మదనపల్లె అర్బన్ : అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ సమాజాన్ని పెడదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్‌పి కె. కేశప్ప తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలంలో జూదరులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌పి ఆర్.గంగాధర్ రావు ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజనల్, సివిల్ ఎస్‌టిఎఫ్ ఏర్పాటు చేసి కచ్చితమైన సమాచారంతో సబ్ డివిజనల్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా తమ వచ్చిన సమాచారం మేరకు రామసముద్రం మండలం యలవ నెల్లూరు పంచాయతీ దాసార్లపల్లి గ్రామం వద్ద కర్ణాటక సరిహద్దులో మల్లికార్జునరెడ్డి అలియాస్ అర్జునరెడ్డి, నాగరాజా అలియాస్ అరటికాయల రాజా అనే వ్యక్తులు ఆర్గనైజ్డ్ గాంబ్లింగ్ నిర్వహిస్తుండగా మదనపల్లి రూరల్ సిఐ ఓ. శివాంజనేయులు , రామస ముద్రం ఎస్‌ఐ సి. చంద్రశేఖర్, సబ్ డివిజనల్ స్పెషల్ పార్టీ బందం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారని చెప్పారు. 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 47,150 నగదు,1 7 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు, ఐదు బంగారు ఉంగరాలు మూడు వెండి చైన్లు, రెండు వెండి కడియాలు, ఒక వెండి ఉంగరం, ఒక వాచ్ స్వాధీనం చేసుకొని గాంబ్లింగ్ యాక్ట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. ఇందులో ఆర్గనైజర్లతో పాటు సుమారు 30 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. డంప్ కాల్స్ ద్వారా మిగిలిన పేకాట రాయుళ్లను కూడా గుర్తించి వారిని కూడా త్వరగా అరెస్టు చేసి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. . జూదం ఆడటం వల్ల చాలా కుటుంబాలు నాశన మవుతున్నాయని, తద్వారా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలిపారు. ఈ బెట్టింగుల వల్ల చాలామంది అప్పుల చేయడం ఇళ్లలో ఉన్న వస్తువులు, టూ వీలర్స్‌ను కూడా తాకట్టు పెట్టి అప్పుల పాలై జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. జూదరులు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని జూదరులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.










