ప్రజాశక్తి- హుకుంపేట: ఆశాలు, సిహెచ్‌డబ్య్లులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం రూ26వేలు సాధించేంత వరకు పోరాటం ఆగదని, సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు,బోనంగి చిన్నయ్య పడాల్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో అల్లూరి జిల్లా ఆశాలు, సిహెచ్‌డబ్ల్యుల మొట్టమొదటి సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, కార్మికు వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న 40చట్టాలను ఒకే ఆర్డినెన్స్‌తో నాలుగు కోడ్లుగా మార్చి యాజమాన్యాలకు కార్మికులను కట్టుబానిసలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం కార్మికులు పోరాడుతుంటే, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, మూసేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయని మండిపడ్డారు. ఆశాలు, సిహెచ్‌డబ్య్లులు, ఇతర కార్మికులతోపాటు గ్రామవాలంటీర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశాలకు దోమతెరల పంపిణీ, పల్స్‌పోలియో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు.సమస్యలపై తక్షణం స్పందించకుంటే ఐటిడిఎను ముట్టడిస్తామని హెచ్చరించారు.అంతకుముందు ఇటీవల మరణించిన ఆశాలు, సిహెచ్‌డబ్ల్యులకు సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.మంగమ్మ, దాసమ్మ, ధనలక్ష్మి, పార్వతి, వరికోటి లక్ష్మి, కష్ణవేణి, కొండమ్మ, భానుమతి పాల్గొన్నారు.










