Jul 12,2023 23:57

పల్నాడు జిల్లా: ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న చేపట్టనున్న ధర్నా జయప్రదం చేయాలని ఏపీ ఆశా వర్కర్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివ కుమారి పిలుపునిచ్చారు. ఈ మేరకు ధర్నాకు సంబంధించి వినతి పత్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యా లయంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. పద్మా వతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక ఆశా, అంగన్వాడీ తదితర వ్యవస్థలలో రాజకీయ వేధింపులు ఎక్కువయ్యా యన్నారు. ఆశా వర్కర్స్‌ కు తాము పని చేసే విభాగాలకు ఎటు వంటి సంబంధం లేని పనులు చేయిస్తున్నారన్నారు. ఆన్లైన్లో వర్క్‌ కు సంబంధించిన శిక్షణ, సమర్థవంతంగా పని చేసే ఫోన్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, యాప్‌ లు సరిగ్గా పని చేయకపోవడం వలన వారు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఆన్లైన్‌ పని భారం తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ సెలవులు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆన్లైన్‌ వర్క్‌ ల పేరుతో జరుగుతున్న వేధింపులు,బెదిరింపులు వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. రికార్డులు రాయాలని జారీ చేయడం తగదు అన్నారు. సెల్‌ ఫోన్స్‌ పనిచేయకపోతే చేతి నుండి డబ్బు పెట్టి సెల్ఫోన్‌ కొనుగోలు చేసి పని చేయాలని వేధిస్తున్నారన్నారు.26 రకాల రికార్డులు కూడా సొంత డబ్బులతో రికార్డులు కొనుగోలు చేయాలంటున్నారని, విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.చంద్రకళ, ఆశాలు ధనలక్ష్మీ, అనూరాధ, కనకరత్నం పాల్గొన్నారు.