రాజకీయ వేధింపులు దారుణం
రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలి
జిల్లా మూడో మహాసభలో ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి
ప్రజాశక్తి - ఏలూరు
ఆశ వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఉద్దరాజు రామం భవనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మూడో మహాసభ జరిగింది. ఈ మహాసభకు జిల్లా అధ్యక్షులు డి.జ్యోతి, పి.కమల, మేరీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ధనలక్ష్మి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశా వర్కర్లకు కనీస వేతనాలిచ్చేందుకు ప్రభుత్వాలకు చేతులు రావడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్లతో వారికి సంబంధం లేని పనులు చేయిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అనేక చోట్ల రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నారన్నారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు రూపాయి కూడా పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్ రమావత్ లీలావతి విధి నిర్వహణలో ఉండగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కె.పోసమ్మ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి మాట్లాడారు. మూడేళ్ల కాలంలో జిల్లాలో ఆశ వర్కర్ల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించామన్నారు. సిఐటియు నాయకులు కె.రాజా రామ్మోహన్‌రారు, డిఎన్‌విడి.ప్రసాద్, ఆర్.లింగరాజు ప్రసంగించారు. మహాసభలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు చింతపల్లి లక్ష్మి, లారెన్స్ కుమారి, కామేశ్వరి, దేవి, రోజా, తులసి, దుర్గ ప్రసంగించారు










