Nov 13,2023 23:46

మాట్లాడుతున్న డి.శివకుమారి

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) కావూరు పిహెచ్‌సి సమావేశం పట్టణంలోని ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించారు. సమావేశానికి సరస్వతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి డి.శివకుమారి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేల అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వర్తింపజేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, డైలీవేజ్‌, కంటిన్జెంట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలన్నారు. వత్తిలో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు మొత్తాన్ని ప్రైవేటీకరించడం వల్ల నిరుద్యోగం పెరిగి కార్మికులకు ఇచ్చే వేతనాలు తగ్గుతున్నాయని, నిరుద్యోగులు పనుల కోసం వలసలు వెళ్తునారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వమూ అమలు చేస్తోదంని, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలతోపాటు ఇంటి, చెత్త తదితర పన్నులు పెంచుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం ఉద్యమాల్లో స్కీమ్‌వర్కులు భాగస్వామ్యం కావాలని, విజయవాడలో బుధవారం నిర్వహించే ప్రజారక్షణభేరి బహిరంగ సభకు ఆశాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్లను రద్దుచేసి కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులను నమోదు చేసి వారికి పింఛను, సామాజిక భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బి.కోమలి, ఉపాధ్యక్షులుగా జె.పరమేశ్వరి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.రంజాన్‌బి, సహాయ కార్యదర్శిగా ఎస్‌.సుభాషిణి, కోశాధికారిగా కె.సీతమహాలక్ష్మి, సభ్యులుగా బి.కరుణ, సరస్వతి ఎన్నికయ్యారు. సమావేశంలో యూనియన్‌ మండల అధ్యక్షురాలు జ్యోతి, కార్యదర్శి మరియమ్మ, వి.రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.