Nov 07,2023 21:37

ఆశాలకు సూచనలు చేస్తున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి -వీరఘట్టం :  ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు చేరువచేయడానికి ఆశా కార్యకర్తలే కీలకమని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం వీరఘట్టం, బిటివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని సందర్శించి ఆశా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమాన్ని వైద్యాధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో నిర్వహించి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందజేయాలని సూచించారు. ఇందులో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలన్నారు. ఆశాలకు ఇవ్వబడిన హెచ్‌బిఎన్‌సి కిట్లను ఉపయోగించి వారి పరిధిలో ఉన్న నవజాత శిశువులను ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యం పరిశీలించాలని, ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, బరువు, శ్వాస ప్రక్రియ తదితర వివరాలు పరిశీలించి నమోదు చేయాలన్నారు. అలాగే పిల్లలకు వేస్తున్న ఐరన్‌ సిరప్‌ విటమిన్‌ ఏ ,టీకాలు ,వివరాలు షెడ్యూల్‌ ప్రకారం సందర్శించి నమోదు చేయాలన్నారు. గర్భిణీలను త్వరగా గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేసి ఆరోగ్య తనిఖీలు పరీక్షలు చేయాలన్నారు. మొదటి కాన్పు ఆడ శిశువును జన్మించిన, రెండో కాన్పు ు గర్భిణీలకు ప్రభుత్వం అందజేస్తున్న పిఎంఇవై పథకం అర్హులందరికీ చేరేలా చర్యలు చేపట్టాలని కార్యకర్తలు ఆదేశించారు. గర్భనిర్ధారణ పరీక్షల కిట్లు ఆశాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్య సలహాలు సూచించేందుకు ఇవ్వబడిన కిల్కరి మొబైల్‌ నెంబర్‌ గర్భిణీల వద్ద ఉండాలని, వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్కు గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి మాతా, శిశు మరణాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జి.ప్రదీప్‌ కుమార్‌, పి.ఉమామహేశ్వరి, ఎ.మానస, ఎస్‌.నితీశా, సూపర్వైజర్లు జగన్నాథరావు, శాంతి కుమారి, కల్యాణి, శ్రీనివాసరావు, ఇందిరాదేవి, జయగౌడు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.