Aug 21,2022 00:13

పొలం పనుల్లో నిమగమైన వ్యవసాయ కూలీలు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు గతేడాది కంటే కొంత మెరుగ్గావుంది. వర్షాలు కురవడం, జలాశయాల్లో నీరు పుష్కలంగా వుండడంతో ఖరీఫ్‌ సీజన్‌లో అగ్రభాగమైన వరి సాగు ఆశాజనకంగా వుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 2,14,642.5 ఎకరాలకు ఈ నెల 19 నాటికి 93,597.5 (44 శాతం) ఎకరాల్లో సాగు నమోదైంది. ప్రధానమైన వరి సాగు 1,36,232 ఎకరాలకు 50,420 ఎకరాల్లో ఉడుపులు పూర్తయ్యాయి. గతేడాది ఆగస్టు 19 నాటికి వరి సాగు 25,450 ఎకరాల్లో జరిగింది. వరి తరువాత రెండో ప్రధాన పంట చెరకు సాగు విస్తీర్ణం తక్కువగా వుంది. చెరకు సాధారణ విస్తీర్ణం 67,997.5 ఎకరాలకు 37,980 ఎకరాల్లో పంటను రైతులు వేశారు. గతేడాది 41,777.5 ఎకరాల్లో చెరకు సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది 3797.5 ఎకరాల్లో చెరకు సాగు తగ్గింది. జిల్లాలోని నాలుగు సహకార సుగర్‌ ఫ్యాక్టరీల్లో మూడు ఫ్యాక్టరీల క్రషింగ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. రెండేళ్ల క్రితం తుమ్మపాల, గత సీజన్‌లో ఏటికొప్పాక, తాండవ సుగర్‌ ఫ్యాక్టరీల క్రషింగ్‌ ఆపింది. నాలుగు సుగర్‌ ఫ్యాక్టరీల్లో గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ నడుస్తోంది. రైతులకు అందుబాటులో వున్న సుగర్‌ ఫ్యాక్టరీల క్రషింగ్‌ నిలిపివేయడంతో చెరకు సాగు బదులు ఇతర పంటల వైపు మళ్లారు. నువ్వులు 2902 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1675 ఎకరాల్లో సాగు నమోదైంది. 2,845 ఎకరాల చిరు ధాన్యాల సాగుకు 1185 ఎకరాల్లో సాగవుతోంది. తాండవ, రైవాడ, కోణాం, పెద్దేరు జలాశయాల కింద 75,144 ఎకరాల ఆయకట్టుకు 22,171 (29 శాతం) ఎకరాల్లో వరి పంట సాగు నమోదైంది. సాగైన వరిలో తాండవ కింద 18,688 ఎకరాలు, పెద్దేరు కింద 3,483 ఎకరాలు వుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు 20 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 419.9 మిల్లీమీటర్లకుగాను 422 మిల్లీమీటర్లు నమోదైంది.
నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో జలాశయాల్లోనినీటి మట్టాలు గతేడాది కంటే బాగున్నాయి. పెద్దేరులో తేడా లేనప్పటికీ, తాండవ, రైవాడ, వరహా, కోణాం జలాశయాల్లో గతేడాది కంటే నీరు ఎక్కువగా వుంది.