Jul 05,2023 00:25

సీలేరులో నేరేడు పళ్ళు విక్రయిస్తున్న మహిళ

ప్రజాశక్తి-సీలేరు
జీకే.వీధి మండలం సీలేరు పరిసర ప్రాంతాలతో పాటు మారుమూల అటవీ ప్రాంతంలో నేరేడు పండ్లు ఈ ఏడాది ఆశాజనకంగా పండాయి. వీటిని గిరిజనులు సేకరించి విక్రయాలు జరుపుతున్నారు. నేరేడు పండు మధుమేహానికి మంచిదని డాక్టర్లు సూచిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. గత ఏడాది నేరేడు పండ్లు పంట పూర్తిగా ఏజెన్సీలో కనుమరుగయింది. ఈ ఏడాది నేరేడు ఆశాజనకంగా పండడంతో గిరిజనులకు కాసులు కురిపిస్తున్నాయి. చిన్న డొక్కును కొలమానికంగా తీసుకొని ఒక డొక్కు పది రూపాయల నుంచి 20 రూపాయలు విక్రయిస్తున్నారు. పిల్లి గెడ్డ, కాట్రగెడ్డ గిరిజనులు నేరేడుపల్లి సేకరించి వారపు సంతలతో పాటు విడిరోజుల్లో కూడా విక్రయాలు జరిపి అధిక లాభాలు పొందుతున్నారు. సీలేరు దారకొండ తదితర ప్రాంతాల్లో విక్రయాలు జరపడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విఎస్‌ఎస్‌ పనుల్లో భాగంగా గిరిజనులకు పని కల్పిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం సీలేరు అటవీ రేంజి పరిధిలో నేరేడు మొక్కలు నాటారు. అవి నేటికీ తమకు పలసాయాలు అందిస్తుండడంతో ఆర్థికంగా దోహదపడుతున్నాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.