చేతికొచ్చిన పంట
ముమ్మరంగా పొగాకు పందిళ్ల ఏర్పాటు
రూ.55వేలు గిట్టుబాటు ధర కల్పించాలి : రైతుల డిమాండ్
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
మండలంలోని నాటు పొగాకు పంట కోతకు వచ్చింది. పొగాకును నరికి పందిరి కట్టే ప్రక్రియ వేగంగా సాగుతుంది. మండలంలో బుసరాజుపల్లి, కంగాలవారిగూడెం, కొమ్ముగుడెం, నూతిరామన్నపాలెం, ఇప్పాలపాడు, వీరన్నపాలెం, సీతప్పగూడెం, అంతర్వేదిగూడెం గ్రామాలకు చెందిన రైతులు 414 ఎకరాల్లో నాటు పొగాకును సాగుచేశారు. ఈ పంట చేతికిరావడంతో కోతలో భాగంగా ముందుగా నాటుపొగాకు మొక్కలను నరికి పందిరి కడతారు. పొగాకు ఆరిన తరువాత కావును వేస్తారు. కావులలో పొగాకు బాగా మాగిన తర్వాత కూలీలతో రెలిపించి మళ్లీ పొగాకును కావు వేస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత పుట్టిలలో పొగాకును అమ్ముతారు. ఈ విధంగా నాటు పొగాకును పండించే రైతులు ఈ ప్రక్రియలో పంటను వేయడానికి సుమారు ఎకరాకు రూ.80 వేలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం అవుతున్న పెట్టుబడి ఖర్చులకు రైతుకు లాభసాటిగా ఉండాలంటే సుమారు పుట్టి ధర రూ.55 వేలుపైన ఉంటేకానీ రైతు లాభం రాదని తెలిపారు. ప్రస్తుతం మండలంలో అన్నిచోట్లా నాటు పొగాకు పంట ఆశాజనకంగానే ఉందని రైతులు అంటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పంటకు గిట్టుబాటు ధర ఉంటే కష్టాలు తీరుతాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
రూ.55 వేలు ఉంటేనే గిట్టుబాటు
కారం ఆనంద్, పొగాకు రైతు, వీరన్నపాలెం
నాటు పొగాకు సాగుకు పెట్టుబడులు అధికంగా పెట్టాలి. ఈ ఖర్చుకు తగ్గట్టుగానే గిట్టుబాటు ధర రూ.55 వేలు కంటే ఎక్కువ ఉండాలి. అలా అయితేనే మాకు లాభం వస్తుంది. ప్రభుత్వం ఈ నాటు పొగాకు పంటకు మంచి ధరను ఇవ్వాలి.










