ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఎన్.వెంకటేశ్వర్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే విత్తనాలు సరఫరా చేశామని, ఎరువులు, పురుగు మందులు కూడా సరఫరా చేస్తామని అన్నారు. ప్రస్తుతం కృ˜ష్ణాడెల్టాలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని, కాల్వలకు నీరు వస్తోందని చెప్పారు. ప్రస్తుతం సీజన్ ఆశాజనకంగా ఉందన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వివరించారు.
ఖరీఫ్ సాగు ఎలాఉంది?
జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారని అంచనా ఉండగా దాదాపు 20 వేల ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేశారు. డెల్టాలో ఇంకా నాట్లు ప్రారంభం కాలేదు. పత్తి సాగు 77 వేల ఎకరాలకు గాను 20 వేల ఎకరాల్లో విత్తనాలు నాటారు. ఇతర పంటలు మరో రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. 3.25 లక్షల విస్తీర్ణంలో పంటలు సాగు చేయాల్సి ఉండగా వచ్చేనెల మొదటి వారం కల్లా 90 శాతం విస్తీర్ణంతో సాగవుతుంది.
రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం
తొలి దశలో తొలకరి పంటలుగా గ్రీన్ మెన్యూర్ విత్తనాలు (పచ్చిరొట్ట) విత్తనాలు అందించాం. జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు ఇప్పటికే ఆర్‌బికేల్లో అందుబాటులో ఉంచాం. వరి విత్తనాలు కిలో రూ.5కే సబ్సిడీపై ఇస్తున్నాం. మినుము, పెసర విత్తనాలు కూడా సబ్సిడీపై అందిస్తున్నాం. పత్తి విత్తనాలు 14 వేల ప్యాకెట్లు, మిర్చి విత్తనాలు ఆరువేల ప్యాకెట్లు ఆర్‌బికేల్లో అందుబాటులో ఉంచాం. వీటిని రైతులు 50 శాతం సబ్సిడీతో తీసుకోవచ్చు.
వెదపద్ధతిలో సాగు వల్ల ప్రయోజనాలు?
వరి వెద పద్ధతి వల్ల ఏడు రోజుల ముందుగానే పంట ఎదుగుదల దశ ప్రారంభం అవుతుంది. నారుమడి దశ ఉండదు. 135 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది.నాటుపద్ధతి అయితే 145 రోజుల వరకు వేచి ఉండాలి. నాట్లు పద్ధతికి అయ్యే ఖర్చు మిగులుతుంది. నీటి అవసరం కూడా తగ్గుతుంది.
కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల నియంత్రణ?
కల్తీ విత్తనాలు, నకిలీపురుగు మందులను అమ్మినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 600 విత్తనాల నమూనాలను తీశాం. ఆరు శ్యాంపిల్స్ ఫెయిల్ అయినట్టు నివేదిక వచ్చింది. సంబంధిత కంపెనీల వారిపై ప్రాసిక్యూషన్‌కు కేసు దాఖలు చేశాం. దుకాణాలపై నిఘా ఉంచాం. రవాణా కార్యాలయాలు, పార్శిల్ సర్వీసులపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాం. ఇటీవల గుజరాత్ నుంచి పత్తివిత్తనాలు తీసుకువస్తుండగా బస్టాండ్‌లో పట్టుకున్నార. పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాం.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు?
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) పెద్దసంఖ్యలో ఇస్తున్నాం. గతేడాది ఇచ్చిన రైతులు అదే పొలంలో కొనసాగితే వాటిని భూ యజమానులతో మాట్లాడి రెన్యూవల్ చేస్తాం. భూమి మార్చుకుంటే కొత్త దరఖాస్తు తీసుకుని సిసిఆర్‌సిలు ఇస్తాం. ఇటీవల సురక్ష ద్వారా పెద్ద సంఖ్యలో సిసిఆర్‌సిలు జారీ చేశారు. ఇప్పటి వరకు 24 వేల మందికి జారీచేశాం. తొలుత 34 వేలు లక్ష్యంగా పెట్టుకోగా ఈ లక్ష్యాన్ని ఇటీవల 54 వేలకు పెంచాం. కౌలురైతులందరికీ సిసిఆర్‌సి ఇవ్వడానికి కృషి చేస్తాం.










