సంకల్ప బలం ఉంటే అసాధ్యం సైతం సుసాధ్యమవుతుంది. అయితే ధైర్యంగా ముందడుగు వేయడానికీ ఎంతో ధైర్యం కావాలి. ఇటీవల పూణెలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. యోగిత ధర్మేంద్ర సతవ్ అనే 42 ఏళ్ల మహిళ అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఈ సాహసోపేత నిర్ణయానికి కారణం ఆమెలోని దృఢమైన నమ్మకమే. ఆత్మవిశ్వాసంతో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలే ఓ కుటుంబాన్ని నిలబెట్టాయి. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోగితపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అసలు ఆమె చేసిన సాహసమేంటి? ఆ సాహసం వెనుక ఆమె పడిన కష్టమేంటి వంటి విశేషాలు తెలుసుకుందాం..!
మామూలు సమయాల్లో సమస్యలను ఎదిరించి నిలబడటం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా వరకూ చూస్తుంటాం. అయితే ఆపత్కాల సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడమే ప్రత్యేకం. సరిగ్గా అలాంటి అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది ఆమె. ఆత్మవిశ్వాసంతో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలే ఓ కుటుంబాన్ని నిలబెట్టాయి. అయితే ఆమె ధైర్యసాహసాలపై కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించింది. ఆపద్కాలంలో ఆమె వ్యవహరించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడింది. 'హ్యాట్సాఫ్'.. మహిళలు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగలరు.. ధైర్యంతో ముందడుగు వేసి, అద్భుతాలు సృష్టించగలరు.. అంటూ ఆ మహిళపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దాదాపు 20 మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులతో ఒక మినీబస్సులో జనవరి 7న పూణెలో విహారయాత్రకు వెళ్లారు. ఇంతవరకూ బాగానే ఉంది. బస్సంతా ఆట పాటలతో.. చిన్నారుల డ్యాన్సులతో కనుల పండుగగా ఉంది. అయితే తిరిగి వచ్చే క్రమంలో మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ కొంత అసౌకర్యానికి గురయ్యాడు. ఆరోగ్యం సహకరించక వెంటనే బస్సును ఓ పక్కకు ఆపి, స్పృహ కోల్పోయాడు. ఊహించని హఠాత్పరిణామంతో బస్సులోని మహిళలు చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. అతడిని ఎలా కాపాడాలో అర్థంకాక బిక్కచచ్చిపోయారు. అయితే బస్సులో ఉన్నవారందరూ మహిళలు, చిన్నారులే కావడంతో సహాయం కోసం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు కూడా. అయితే తామంతా నగరానికి చాలా దూరంలో ఉన్నామని, అప్పటికే చీకటి పడిపోతుండటంతో.. హెల్ప్‌లైన్ సహాయం అందే సమయానికి పరిస్థితి చేదాటిపోవచ్చని భయాందోళన చెందారు.
సమయం మించిపోతుండటంతో ఆ బస్సులోనే ప్రయాణిస్తున్న యోగిత ధర్మేంద్ర సతవ్ అనే 42 ఏళ్ల మహిళ.. బస్సు స్టీరింగ్ అందుకొని, బస్సును డ్రైవ్ చేసింది. ఇందులో ఆమె చేసిన సాహసం ఏముంది అనే సందేహం కలగొచ్చు. అయితే అప్పటివరకూ ఆమెకు బస్సు నడిపిన అనుభవం లేదు. తనది కేవలం కారు నడిపిన అనుభవమే.. ఇదే ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయం. కారు నడిపిన కొద్దిపాటి అనుభవంతో బస్సును బాగానే కంట్రోల్ చేసి, ఆస్పత్రికి తీసుకెళ్లింది. కాస్తా కూస్తో దూరం అయితే ఫర్లేదు.. ఏకంగా 35 కిలోమీటర్లు బస్సును నడిపింది యోగిత. ఈ విధంగా ఆమె డ్రైవర్ ప్రాణాలు కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో యోగితపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ''హ్యాట్సాఫ్ యోగిత!'' అంటూ ఆమెను కొనియాడుతున్నారు.
'కోటక్' క్యాంపెయిన్‌తో వైరల్..
కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మహిళా దినోత్సవం సందర్భంగా 'డ్రైవ్ లైక్ ఏ లేడీ' పేరుతో యోగిత ధైర్యసాహసాలపై ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించింది. ఆపద్కాలంలో ఆమె వ్యవహరించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడింది. మహిళా డ్రైవర్ల సేవల పట్ల సానుకూలతతో ముందుకు సాగేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు వివరించింది.
బస్సు నడపడం అదే తొలిసారి..
బస్సు నడపడం గురించి యోగిత ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'గత 20 ఏళ్లుగా మారుతి సెలరియో, అసెంట్, ఓమిని వ్యాన్ నడుపుతున్నాను. అయితే, బస్సు నడపడం ఇదే తొలిసారి. ఆ సమయంలో నాకు వేరే మార్గం కనిపించలేదు. ఆ రోజు బస్సులో అందరూ ఆందోళన చెందుతున్నారు. అప్పటికే చీకటిపడుతోంది. నాకు కారు నడిపిన అనుభవం మాత్రమే ఉంది. కాబట్టి మెల్లిమెల్లిగా బస్సును సేఫ్‌గా సిటీ వరకూ తీసుకెళ్దాం అనే ఉద్దేశ్యంతో బస్సుని నడిపాను' అని తన అనుభవాన్ని వివరించింది. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత బస్సు ఓనర్ మరో డ్రైవర్‌ను తీసుకొని వచ్చాడని, అక్కడి నుంచి అతనే బస్సును నడిపాడని, ఆ తర్వాత తాము తమ గమ్యస్థానానికి చేరుకున్నామని యోగిత తెలిపారు.