May 18,2021 07:23

   విప్లవ జీవితం తప్ప వ్యక్తిగత జీవితం కానరాని మహోన్నత విప్లవకారుడు హోచిమిన్‌. విప్లవాత్మక కార్యకలాపాలు, నిరాడంబర జీవితం, నిజాయతీల సమ్మిళిత స్వరూపం ఆయన. అత్యంత క్రూరమైన ఫ్రాన్స్‌, జపాన్‌ వలస పాలనకు వ్యతిరేకంగా చివరకు అమెరికా పైశాచికత్వానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాల పాటు పార్టీని, ప్రజా బాహుళ్యాన్ని సాయుధ తిరుగుబాటులో, ప్రతిఘటనలో ఐక్యంగా నడిపించిన అద్భుతమైన సమర్ధత ఆయనది.
 

                                       సామ్రాజ్యవాదాన్ని మట్టి గరిపించిన మహా విప్లవం

   వియత్నాం విప్లవం గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగినది. 35 సంవత్సరాల పాటు కనీవినీ ఎరుగని సామ్రాజ్యవాద క్రూరత్వానికి వ్యతిరేకంగా సాగిన విప్లవమది. వియత్నాం అనేది చాలాకాలం ఫ్రాన్స్‌ దేశానికి వలసగా వుండింది. ఫ్రాన్స్‌ దీన్ని మూడు ముక్కలుగా విడగొట్టింది. ఫ్రెంచి దురాగతాలకు వ్యతిరేకంగా అనేక వామపక్ష విప్లవ గ్రూపులు అనేక సంవత్సరాలు పోరాటాలు సల్పుతూ వచ్చాయి. ఈ పోరాటాల నడుమ తమ దేశ స్వాతంత్య్రం కోసం హోచిమిన్‌ వీరోచిత ప్రస్థానం ప్రారంభమైంది. తమ దేశాన్ని బానిసత్వంలో ముంచెత్తుతున్న ఫ్రాన్స్‌కి 21 యేళ్ల వయసులో చేరుకున్నాడాయన. ఆ దేశంలో వున్న వియత్నాం కష్టజీవులను దగ్గరకు చేర్చి ''వియత్నాం దేశ భక్తుల సంఘం'' ప్రారంభించాడు. 1917లో రష్యాలో కార్మికవర్గ మహా విప్లవం జయప్రదం కావడం, అనంతరం లెనిన్‌ రెండవ ఇంటర్నేషనల్‌ను రద్దు చేసి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ప్రారంభించడం, అందులో వలస దేశాల విముక్తిపై చేసిన గొప్ప తీర్మానం వంటి ఘటనలు హోచిమిన్‌ ను కమ్యూనిజం వైపు అకర్షించాయి. 1920లో ఫ్రాన్స్‌లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడు. అనేక పరిణామాల అనంతరం ఆయన...సోషలిస్టు రష్యాలోనూ, ఉధృతంగా సాగుతున్న విప్లవ చైనాలలో వివిధ పేర్లతో తలదాచుకున్నాడు. అక్కడ నుండే వియత్నాం వలస వ్యతిరేక పోరాటాన్ని నడిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆయన మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం, విప్లవ సైన్యాన్ని శక్తివంతంగా నడపడంలో ప్రావీణ్యతను సంపాదించాడు. ప్రత్యేకించి బలమైన శత్రువును ఓడించే గెరిల్లా, సాయుధ తిరుగుబాట్లలో అత్యంత నైపుణ్యం పొందాడు. 1945లో పెద్దయెత్తున ప్రారంభమైన వియత్నాం విప్లవంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించి దాదాపు 25 సంవత్సరాలపాటు విప్లవమే ఆయన, ఆయనే విప్లవంగా పోరాటాన్ని సాగించాడు. 1945లో ఉత్తర వియత్నాం స్వాతంత్య్రం సాధించినప్పటికీ దక్షిణ వియత్నాం ఫ్రెంచ్‌, ఆ తరువాత జపాన్‌ సామ్రాజ్యవాదుల వలస కిందే మగ్గుతూ వుండింది. 1954లో హోచిమిన్‌ నాయకత్వాన విప్లవ దళాలు, ప్రజలు అంతిమ పోరాటం సాగించి ఫ్రెంచి ఆధిపత్నాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే వియత్నాం ప్రజల చిరకాల కోరిక అయిన వియత్నాం ఏకీకరణ మాత్రం సాధ్యం కాకుండా సామ్రాజ్యవాదం అడ్డుపడింది. ఈ పరిస్థితుల్లో ఉత్తర వియత్నాంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం, దక్షిణ వియత్నాంలో విముక్తికై సాగే జాతీయ ప్రజాతంత్ర విప్లవాలు జమిలిగా హోచిమిన్‌ నాయకత్వాన సాగాయి. ఫ్రాన్స్‌, జపాన్‌ కి సాధ్యం కానిది ప్రజా విప్లవాన్ని అంతం చేయగలిగిన మొనగాడుగా జబ్బలు చరుచుకుని రంగంలోకి దిగిన అమెరికా ను హోచిమిన్‌ నాయకత్వాన (ఆయన మరణానంతరం కూడా) వియత్నాం ప్రజలు మట్టి కరిపించారు. ప్రపంచ వ్యాపితంగా అమెరికా పైశాచికత్వాన్ని పెద్ద యెత్తున అసహ్యించుకోవడం, చివరికి అమెరికాలో కూడా వియత్నాం విప్లవ అనుకూల ఉద్యమాలు ప్రారంభం కావడంతో చావు తప్పి కన్ను లొట్టపోయిన అమెరికా అంతిమంగా 1975లో తల దించుకుని వైదొలిగింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలు ఏకీకరించబడ్డాయి. వియత్నాం సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడింది.

                                                             విప్లవ నైతికతే జీవం

   విప్లవ పార్టీ నిర్మాణంలో విప్లవ నైతికత అనే ఓ నూతన అంశాన్ని హోచిమిన్‌ ముందుకు తెచ్చాడు. మనలాంటి వెనుకబడిన దేశాలలో దీర్ఘకాలం శాంతియుత వాతావరణంలో భారీ విప్లవ ఉద్యమాలు లేని వాతావరణంలో కమ్యూనిస్టు పార్టీని ఓ బలమైన విప్లవ పార్టీగా రూపొందించుకోవడానికి విప్లవ నైతికత అనేది ఓ సజీవమైన బంధంగా ఉంటుంది. ''వ్యక్తివాదం అనేది విప్లవ నైతికతకు విరుద్ధంగా నడుస్తుంది. ఇది చాలా కుట్రపూరితంగా, సమర్ధవంతంగా మనలోని విప్లవ తత్వాన్ని వెనక్కి నెడుతుంది. దీని మూలంగానే చాలా మంది కామ్రేడ్లు తాము పార్టీకి ఎంతో చేశామని, అందువలన పార్టీ తమకు ఎంతో చేయాల్సి వుంటుందని వాదిస్తూ వుంటారు. కాదంటే పార్టీకి వ్యతిరేకంగా తయారవుతారు'' అని హెచ్చరించాడు. ఈ విప్లవ నైతికతను నిర్వచిస్తూ ఆయన ''పార్టీ క్రమశిక్షణ పాటించడం, పార్టీ రాజకీయాలను, విధానాలను అమలు చేయడం, ప్రజలకు హృదయపూర్వకంగా సేవలు అందించడం, ప్రతి విషయంలోనూ ఆదర్శంగా ఉండటం. అలాగే మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం. సైద్ధాంతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి విమర్శ, ఆత్మవిమర్శలను ఆచరించడం ఇతర కామ్రేడ్లతో కలిసి అభివృద్ధి చెందటానికి ప్రయత్నించడం'' అని పేర్కొన్నారు. ''విప్లవ నైతికత అనేది ప్రజలతో మమేకమవడం మీద, వారి అభిప్రాయాలను గౌరవించడం, ప్రజలపై నమ్మకముంచడం'' అన్నాడు.
 

                                                              సోషలిజం అజేయం

   సోషలిజంపై అవగాహనను జాతి మొత్తానికి అందించాడు హోచిమిన్‌. ''సోషలిజం అంటే ప్రజల్ని ధనవంతులుగాను, శక్తివంతులుగాను చేయడం. సోషలిజం అంటే ప్రజలకు స్వేచ్ఛను, ఆర్థిక పురోగతిని, సంతోషాన్ని ఇవ్వడం. సోషలిజం అంటే ప్రజలకు విద్య, వైద్యం, సౌకర్యవంతమైన గృహవసతి కల్పించడం. సోషలిజంలో పిల్లల బాగు, వృద్ధుల బాగోగులకు గ్యారంటీ ఇవ్వడం'' అని ఆయన ప్రజలకు చెప్పేవాడు. అలాగే ఆయన తన దేశలో సోషలిజం ఎలా నిర్మించబడాలి అనేదానికి సూచనలిస్తూ ''సోషలిజం అనేది ఒక సమూలమైన మోడల్‌ కాదు. అది ఒక నిర్దిష్టమైన సూత్రీకరణ. కాబట్టి సోషలిజం నిర్మాణంలో ఆచరణాత్మకత, వస్తుగత పరిస్థితులను అర్ధం చేసుకోవడం, సోషలిస్టు సూత్రీకరణను నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా, సృజనాత్మకంగా అమలు చేయడం జరగాలి. మూఢ విశ్వాసంతోనూ, అచ్చుగుద్దినట్లు ఒకే మాదిరిగా వుండాలన్న మూర్ఖపు వాదనలకు తావుండకూడదు'' అని ఆయన చెప్పిన మాటలను ఆచరించి ఆయన మరణానంతరం వియత్నాం కమ్యూనిస్టు పార్టీ సోషలిజాన్ని నిర్మించింది. అందువలనే ఈరోజు, కరోనా లాంటి మహమ్మారితో ప్రపంచం అల్లాడుతుంటే ఇప్పటికీ ఒక్క మరణం కూడా లేకుండా అనేక దేశాలకు మందులను, టీకాలను, చివరికి తన దేశాన్నే సర్వనాశనం చేసిన అగ్రరాజ్యం అమెరికా కు సైతం పంపుతున్నదంటే అది సోషలిజం గొప్పతనమే. ఈ విజయం వెనుక మహత్తర వియత్నాం ప్రజా విప్లవ పోరాటం, దానికి మహోన్నతుడు హోచిమిన్‌ నాయకత్వం, దార్శనికతే కీలకం.

/ వ్యాసకర్త సిపియం తూర్పు కృష్ణా జిల్లా కార్యదర్శి /

ఆర్‌. రఘు