రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రెండవ విడత వ్యాధి విస్తరణ వేగంతో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సంఖ్యరీత్యా కేసులు ఎక్కువ కావడమే కాదు మరణాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు అందుబాటులో లేవు. ఫలితాలు 24 గంటల్లో రావాల్సినది నాలుగు నుండి ఐదు రోజులు పడుతోంది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు రూ.1700 నుండి రూ.3500 వరకు ధర ఉంటే బ్లాకులో 20 నుండి 30 వేల రూపాయలకు అమ్ముతున్నారు. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. మెడికల్ ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు పోతున్నాయి. కొత్తగా ప్రారంభిస్తున్న జిల్లా స్థాయి ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు అన్నీ కూడా నిండిపోయాయి. సిబ్బంది రిక్రూట్‌మెంట్ 50 శాతంగానే ఉంది. చివరికి శవాలను భద్రపరిచే మార్చురీలు తదితర సౌకర్యాలు లేక శవాలు కుళ్ళిపోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో రోగికి బెడ్లు దొరకవు. అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నత స్థాయి వైద్యానికి అనువైన సదుపాయాలు లేవు. అనేక కార్యకలాపాల్లో కోవిడ్ కట్టడి కూడా ఒకటిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రాజకీయ సంకల్పం కొరవడినందువల్లనే ఈ అసాధారణ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రజల్ని ఆదుకోవడంలో విఫలమయ్యాయి.
అసాధారణ పరిస్థితులు
వ్యాధి విస్తరణతో అసాధారణ పరిస్థితులు ఏర్పడితే దానికి అనుగుణంగా కంటెంజెన్సీ ప్లాను ప్రభుత్వం దగ్గర లేదు. గత సంవత్సరం మెడికల్ ఆక్సిజన్ కోసం 162 ప్లాంట్లు నెలకొల్పుతానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడిచినా ఈ ప్లాంట్లు అందుబాటులోకి రాలేదు. కేవలం 33 ప్లాంట్లు దాదాపు పూర్తవుతున్నాయి. అత్యధికం నిర్మాణం కాలేదంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం స్పష్టమవుతుంది. వ్యాక్సినేషన్ ప్రపంచంలో ప్రజలందరికీ ఉచితంగా అందిస్తుంటే మన దేశంలో మే 1 నుండి 18 సంవత్సరాల పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సినేషన్ అందుకు నోచుకోవడం లేదు. కంపెనీలు తయారు చేసే వ్యాక్సినేషన్‌లో 50 శాతం కేంద్రానికి రూ.150కి ఇవ్వాలని రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు సంస్థలకు రూ.600కు అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారమే కాక రూ.600కు కొనే ప్రైవేటు వారితో పోటీ పడి కొనుగోలు చేయాల్సి రావడంతో వ్యాక్సిన్ రాష్ట్రాలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.
ఆర్‌టిపిసిఆర్ పరీక్ష
వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. దానికనుగుణంగా ఆర్‌టిపిసిఆర్ పరీక్ష లాబొరేటరీలు అందుబాటులో లేవు. 24 గంటల్లో ఇవ్వాల్సిన రిపోర్టులు 4, 5 రోజులకు గానీ ఇవ్వడం లేదు. దీనివల్ల ఆర్‌టిపిసిఆర్ రిజల్టు లేని వారిని హాస్పటళ్లు ఆడ్మిట్ చేసుకోవు. రిపోర్టు వచ్చే వరకు ఆగడమంటే వ్యాధిని అనేక మందికి అంటించడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది అదే. కుటుంబాలకు కుటుంబాలు ఈ కారణంగానే వైరస్ బారిన పడుతున్నాయి. ఆర్‌టిపిసిఆర్ పరీక్షతో నిమిత్తం లేకుండా రాపిడ్ టెస్ట్‌గానీ, మరొకటి గానీ లేకపోయినా వ్యాధి లక్షణాలను బట్టి హాస్పటళ్లలో ఆడ్మిషన్లు తక్షణం ఇవ్వాలని ప్రజలు ఘోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం లోపించడం వల్లనే అనేక సమస్యల్లో ఇదొక సమస్యగా భావిస్తోంది. ఇది ఒక అసాధారణ పరిస్థితి అని గుర్తించకపోవడమే లోపం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లోపాన్ని గుర్తెరిగి వ్యవహరించాలి.
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్
ఈ ఇంజక్షన్ గరిష్ట చిల్లర ధర ఆయా కంపెనీని బట్టి రూ.1700 నుండి రూ.3000 ఉంది. ఈనాటి డిమాండ్‌లో కేవలం 10 శాతమే అందుబాటులో ఉన్నందువల్ల ఈ ఇంజక్షన్ రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు బ్లాక్‌లో అమ్ముడవుతోంది. అవసరమైన రోగులకు సరైన వైద్యం అందకపోవడానికి అటు ఆక్సిజన్ కొరత ఇటు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కొరత కారణాలు.
కోవిడ్ ఆసుపత్రులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు హాస్పటళ్లను కొన్నింటిని కోవిడ్ హాస్పటళ్లుగా గుర్తించి నోడల్ అధికారులను కేటాయించారు. నెల్లూరు కోవిడ్ ఆసుపత్రిలో 840 బెడ్లు వుండగా వాటిలో 200 ఆక్సిజన్ అందుబాటులో ఉన్న బెడ్లు. నాన్ ఆక్సిజన్ బెడ్లులో ఉన్న రోగుల్లో సుమారు 100-150 మందికి ఆక్సిజన్ అవసరం ఉన్నా వారికి ఆక్సిజన్ అందుబాటులో లేదు. వారి ప్రాణాలు గాలిలో దీపమే!
క్వారంటైన్ కేంద్రాలు - ఐసొలేషన్ సెంటర్లు- సిబ్బంది
మొదటి విడత కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో క్వారంటైన్ మరియు ఐసొలేషన్ సెంటర్లు ప్రారంభించింది. ఉధృతి తగ్గగానే వాటన్నింటినీ మూసివేశారు. రెండవ విడత వస్తుందని అంచనాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇంత ఉధృతంగా ఉన్న తరుణంలో ఒక్క క్వారంటైన్ సెంటర్ గానీ, కరోనా ఐసొలేషన్ సెంటర్ గానీ ఇప్పటికీ ప్రారంభించలేదు. గత సారి నెల్లూరు జిల్లాలో 48 ఐసొలేషన్ కేంద్రాలు అన్ని మండలాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. రెండవ విడత కరోనా కల్లోలం చెలరేగి నెల రోజులు కావస్తున్నా కోవిడ్ ఆసుపత్రుల్లో 50 శాతం సిబ్బందే ఉన్నారు. గతంలో ఉన్న వారందరినీ రిక్రూట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డరు ఇచ్చినా ఇప్పటికీ సగం మందితోనే ప్రస్తుతం అవి పని చేస్తున్నాయి.
తక్షణ చర్యలు
ఆర్‌టిపిసిఆర్ పరీక్షల కోసం లాబొరేటరీలు పెంచడం, ఫలితాలతో నిమిత్తం లేకుండా లక్షణాలనుబట్టి హాస్పటళ్లలో ఆడ్మిషన్ ఇవ్వడం, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్, ఆక్సిజన్ సరఫరా అందుబాటులోకి తేవాలి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాల మీద భారాలు మోపడాన్ని ఎదిరించి ఉచిత వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు జరగాలి. ప్రజా సంఘాలు, సేవా సంస్థల సహకారంతో క్వారెంటైన్ సెంటర్లు, వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో, రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపాలి. అసాధారణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలి.
/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /
పెనుమల్లి మధు











