ప్రజాశక్తి-విజయవాడ
ఈనెల 12 13 వ తేదీలలో విజయనగరంలో జరిగే ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎం.బి.విజ్ఞాన కేంద్రాల్లో పోస్టర్ విడుదల చేశారు. విజయనగరం జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలలో ఆశ వర్కర్లు ఎదుర్కొనే సమస్యలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను నిర్ణయిస్తామని ఆమె చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న ఆశ వర్కర్లకు కనీసం సెలవులు గాని, మెడికల్ లీవులు గాని, వెటర్నిటీ లీవులు గాని లేవని, గర్భవతులైన, బాలింతలైన, ఆశ వర్కర్లు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆమె అన్నారు. సంవత్సరానికి సాధారణ సెలవులు తోపాటు, వేతనంతో కూడిన మెటర్నటీ మెడికల్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండిన ఆశ వర్కర్లను వట్టి చేతులతో ఇంటికి పంపించడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో సంక్షేమ పథకాలు కోత పెట్టటం దుర్మార్గమన్నారు.కనీస వేతనం లేక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగభద్రత, తదితర సమస్యల పరిష్కారం కోసం, ఆశ వర్కర్లందరూ పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వ ర్యంలో పోరాటాలకు సిద్ధమవు తారని ఆమె హెచ్చ రించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి జ్యోతి కోశాధికారి పి. శ్రీలక్ష్మి, డి.సుధారాణి, జి .నాగేశ్వరి జానకి, రేణుక, కనకదుర్గ, హుస్సేన్ బి పాల్గొన్నారు.










