Mar 21,2023 18:09

డిఎంహెచ్‌ఒకు వినతి పత్రం అందచేస్తున్న నాయకులు

ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలి
- ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి
- సిఐటియు, ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
- డిఎంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల

      ఆశా వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం, ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నంద్యాలలోని సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ఆశా వర్కర్లు ర్యాలీగా బయలుదేరి స్థానిక గవర్నమెంట్‌ ఆసుపత్రిలోని డిఎంహెచ్వో కార్యాలయంకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు జి.నాగమణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశలకు సంబంధం లేని పనులు చేయించరాదని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఆశాలకు వారి కుటుంబ సభ్యులకు నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు వేతనంతో కూడిన వెటర్నరీలు ఇవ్వాలన్నారు. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, 104 ఉద్యోగుల కోసం ఆశా వర్కర్లతో ఎటువంటి అదనపు ఖర్చులు చేయించరాదని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన సెల్‌ ఫోన్స్‌ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, వ్యాక్సిన్‌ క్యారియర్‌ ఆశ వర్కర్లతో తెప్పించరాదని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు వి. బాల వెంకట్‌, డి.లక్ష్మణ్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు మాధవి, చెన్నమ్మ, తిరుపాలమ్మ, శివమ్మ, శిరోమణి, భారతి, కపావతి, సరస్వతి, వెంగమ్మ, సులోచన, విజయలక్ష్మి (ముంతాజ్‌), ఆశా వర్కర్లు పాల్గొన్నారు.