Feb 02,2023 00:04

మాట్లాడుతున్న ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శాంతి

ప్రజాశక్తి-అనకాపల్లి
ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు కె.శాంతి డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి రాము నాయుడు కార్మిక కర్షక నిలయంలో బుధవారం ఆశా కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆశాలపై విపరీతమైన పని భారం పెంచిందని, సంబంధం లేని పనులు కూడా అప్పగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉండాల్సిన ఆశా కార్యకర్తలకు సచివాలయాలు, సబ్‌ సెంటర్లు వద్ద డ్యూటీలు వేయడం, జాబు చార్టులో లేని ఆన్లైన్‌ పనులను అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. గతంలో పల్స్‌ పోలియో, టిబి సేవలు అందించినందుకు పారితోషికాలు ఇచ్చే వారని, నేడు ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ పథకాలలో కోత పెడుతున్నారని, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో ఇస్తున్న జీతాలు ఛార్జీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలను తనిఖీల నిమిత్తం ఆసుపత్రికి సొంత డబ్బులతో తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లు సరిగా పనిచేయలేదని, సొంత డబ్బులతో మంచి ఫోన్లు కొనుక్కోమని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, జాబ్‌ ఛార్టు నిర్ణయించాలని, అదనపు పనులు అప్పగించరాదని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ పార్వతి, కార్యదర్శి వరలక్ష్మి, నాగమణి, కే లక్ష్మి, కోశాధికారి సూర్య కుమారి, ఆశా యూనియన్‌ 24 మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.