ప్రజాశక్తి-చింతూరు
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. ఎపి వాలంటరీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ మండల 3వ మహాసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 46 కార్మిక చట్టాలను మార్పు చేసి పెట్టుబడి దారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మద్దత్తు ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్స్ యూనియన్ రంపచోడవరం జిల్లా ప్రథమ మహాసభ డిసెంబర్ 8న రంపచోడవరంలో జరుగుతుందని, దీనిన జయప్రదం చేయాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
మండల మహాసభలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, బీరబోయిన దారేశ్వరి, సహాయ కార్యదర్శులుగా పైడితల్లి, మడకం రాములమ్మ, దుర్గ, ఉపాధ్యక్షులుగా వీరమ్మ, ముత్తమ్మ, రాములమ్మ, కోశాధికారిగా ముత్తమ్మ, 11 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్, సహాయ కార్యదర్శి బీరబోయిన దిలీప్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.










