Nov 08,2023 00:34

ప్రజాశక్తి - పెదకాకాని రూరల్‌ : ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) మండల గౌరవాధ్యక్షులు ఎన్‌.శివాజి కోరారు. మండల కేంద్రమైన పెదకాకానిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం మంగళవారం నిర్వహించారు. శివాజి మాట్లాడుతూ ఆశాలకు జగనన్న సురక్ష పేరుతో పని భారం పెంచారని, అధికారుల వత్తిళ్లూ అధికమయ్యాయని చెప్పారు. సెలవులు ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యలపై ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాలో అందరూ పాల్గొనాలని కోరారు. సమావేవంలో ఎం.ఇందిర, కె.కోటేశ్వరి, ఎన్‌.వరలక్ష్మి, జి.సుధా, జి.ప్రమీల పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తుళ్లూరు : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ఆశాల సమావేశంలో సిఐటియు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు మాట్లాడారు. పని భద్రత కల్పించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆశాలకు రూ.10 వేలు ఇస్తూ కనీసం సెలవు కూడా లేకుండా వెట్టిచాకిరి చేస్తున్నారని, ఆన్‌లైన్‌ వర్క్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. గవర్నమెంట్‌ ఉద్యోగులని చెబుతూ ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వైద్యాధికారి డి.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.