Jul 25,2023 21:47

పిహెచ్‌సి వద్ద నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి -గరుగుబిల్లి : ఈనెల 18న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నందుకు స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం దారుణమని, వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు డిమాండ్‌ చేశారు. ఈ మేకు మంగళవారం స్థానిక పిహెచ్‌సి వద్ద ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మన్మధరావు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారన్నారు. ఈ ఆందోళనకు సంబంధించిన ముందస్తుగానే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, పిహెచ్‌సి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైనట్లు స్థానిక వైద్యాధికారులు ఆశా వర్కర్లకు నోటీసులివ్వడం సమంజసం కాదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం అనేక దశల్లో ఆందోళనలు చేపడతామని, ఇది ప్రభుత్వానికి సమస్యల తీవ్రతను తెలియజేసేందుకు చేసే ప్రయత్నమని, దీనికి కూడా అధికారులు అవకాశం కల్పించుకుండా ఇలా బెదిరించడం సరైన విధానం కాదని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ పిహెచ్‌సిలో ఆశా వర్కర్లకు నోటీసులివ్వలేదని, ఒక ఈ పిహెచ్‌సిలోనే ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఆందోళన నేపథ్యంలో వైద్యాధికారి డాక్టర్‌ సాగర్‌ జిల్లా అధికారులతో సంప్రదిపులు జరిపి షోకాజ్‌ నోటీసులు ఉపసంహరిస్తున్నట్లు నాయకులకు తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి.ఇందిర, బివి రమణ, ఆశా వర్కర్ల నాయకులు గంగాభవానీ, మాలతి, పైడమ్మ తదితరులు పాల్గొన్నారు.