Jun 27,2023 00:52
నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా వర్కర్లు

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణ ఆశా వర్కర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎస్‌ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు, రేపల్లె పట్టణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ రేపల్లె పట్టణం పరిధిలో ఆశా వర్కర్స్‌ కింది వరకు వెళ్లి అనేక ఆరోగ్య సేవలు చేస్తున్నారు, కానీ ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఈ కాలంలో కొత్తగా వచ్చినా మెడికల్‌ ఆఫీసర్‌ ఒత్తిడి వల్ల వస్తున్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని రేపల్లె పట్టణ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రేపల్లెలో 3 అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఉంటే కేవలం ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆశా వర్కర్స్‌ గర్భిణులకు అందించే సేవలు, ఇతర సర్వేలు చేస్తున్నప్పటికీ ఆశా వర్కర్స్‌కు సంబంధం లేని పనులు అప్పజెప్పడం సరికాదన్నారు. ప్రతిరోజూ జనరల్‌ ఒపి ఐదుగురిని వెంటపెట్టుకొని తీసుకురావాలని, ఫోన్‌ చేసిన వెంటనే ఇతర పనుల్లో, ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కి వచ్చి తనకి కనపడాలని, గర్భిణులను సంరక్షించే పనుల్లో ఉండి నడిచి రావటం ఆలస్యం అయితే కోపంగా మాట్లాడటం వంటివి జరుగుతున్నా యన్నారు. ఈమధ్య కాలంలో 2 ఆశ వర్కర్స్‌కు ఆకారణంగా మెమోలు ఇచ్చారు. కావున ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఆశ వర్కర్స్‌కు వస్తున్న స్థానిక సమస్యలు పరిష్కారం చేసి పని ఒత్తిడి తగ్గించాలని అన్నారు. అతి తక్కువ వేతనాలతో చిరు ఉద్యోగులుగా కష్టపడి పనిచేస్తున్నా ఆశ వర్కర్స్‌కి రేపల్లె పట్టణంలో ఎప్పుడు ఇలా ఉద్దేశపూర్వకంగా మెమోలు ఇవ్వలేదని అన్నారు. అలానే పట్టణ జనాభా ప్రకారం ఆశ వర్కర్స్‌ నీ అదనంగా కొత్తవాళ్లను అపాయింట్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణం ఆశ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు టి బుజ్జి ఇతర ఆశా వర్కర్స్‌ పావని, ఎస్తేర్‌ రాణి, మహాలక్ష్మి, జ్యోతి, కీర్తి, గులాబీ తదితరులు పాల్గొన్నారు.